పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు దేశంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై తీవ్రంగా పడుతోంది. భారత్‌లో రోడ్ల నిర్మాణానికి అత్యంత కీలకమైన ‘బిటుమెన్’ కొరత ఏర్పడటమే దీనికి ప్రధాన కారణం. బిటుమెన్ అనేది ముడి చమురును శుద్ధి చేసే ప్రక్రియలో చివరగా మిగిలే అత్యంత మందపాటి పదార్థం. దీనిని సాధారణంగా తారు అని పిలుస్తుంటాం. ఇది రోడ్లను గట్టిగా పట్టి ఉంచడానికి వాడతారు. భారతదేశానికి ఏటా సుమారు 87 లక్షల టన్నుల బిటుమెన్ అవసరం కాగా.. ఇందులో దాదాపు 40 శాతం భాగాన్ని భారత్ విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. ఎక్కువగా ఇరాన్, గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతుంది. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల సముద్ర రవాణా మార్గాలు దెబ్బతిని.. ఈ దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి.

Also Read : భారత్‌లో ఐరన్ డోమ్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రం: ఇజ్రాయెల్ రక్షణ సంస్థ ‘రాఫెల్’ చర్చలు!

భారతదేశం ప్రస్తుతం రష్యా నుండి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నప్పటికీ.. అది బిటుమెన్ కొరతను తీర్చలేకపోతోంది. ఎందుకంటే రష్యా నుంచి వచ్చే తేలికపాటి చమురు నుంచి నాణ్యమైన బిటుమెన్ కాదు. భారతదేశ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే ‘VG-40’ గ్రేడ్ తారు కావాలంటే.. అది ఇరాన్, గల్ఫ్ దేశాల నుండి వచ్చిన బరువైన ముడి చమురు అయి ఉండాలి. దీంతో దేశీయ రిఫైనరీలు డిమాండ్‌కు సరిపడా తారును ఉత్పత్తి చేయలేకపోతున్నాయి.

ఈ సరఫరా గొలుసు దెబ్బతినడం వల్ల గతంలో టన్ను రూ. 40,000 నుండి రూ. 44,000 వరకు బిటుమెన్ ధర ఉండేది. ప్రస్తుతం రూ. 65,000 నుండి రూ. 88,000 వరకు పెరిగింది. అంటే ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. దీనివల్ల రోడ్డు కాంట్రాక్టర్లకు అవసరమైన స్టాక్‌లో కనీసం నాలుగో వంతు కూడా లభించడం లేదు. వర్షాకాలం ప్రారంభం కాకముందే దేశవ్యాప్తంగా దాదాపు 10,000 కిలోమీటర్ల హైవేలను పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తారు దొరక్కపోవడంతో హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పనులు పూర్తిగా నిలిచిపోగా, మిగిలిన చోట్ల పనుల వేగం ఘోరంగా పడిపోయింది.

Also Read : ముదురుతున్న ఇరాన్-అమెరికా వార్.. భారత్ నిర్మించిన చాబహార్ పోర్టుపై అమెరికా దాడి!