
Bangladesh : బంగ్లాదేశ్లో తట్టు వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి కారణంగా దేశంలో ఆరోగ్య వ్యవస్థపై భారీగా ఒత్తిడి పడుతోంది. 2026 మార్చి 15 నుంచి ఇప్పటివరకు 1.89 లక్షల మందికి పైగా ఈ తరహా లక్షణాలతో బాధపడినట్లుగా గణాంకాలు వెల్లడించాయి. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు కనీసం 1,012 మంది ప్రాణాలు కోల్పోయారు.
తట్టు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారిలో దాదాపు 1.49 లక్షల మందిని ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందించాల్సి వచ్చింది. దీంతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న బంగ్లాదేశ్ ఆరోగ్య వ్యవస్థపై మరింత భారం పడింది. జూన్, జూలై నెలల్లో ఈ వ్యాధి వ్యాప్తి కొంత తగ్గినప్పటికీ.. ఆగస్టులో మాత్రం మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో దేశంలో టీకాల పంపిణీ, వ్యాధి గుర్తింపు, పర్యవేక్షణ వ్యవస్థలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా సమయంలో సాధారణ టీకాల కార్యక్రమానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కొంతమంది పిల్లలకు తట్టు టీకాలు వేయలేకపోయారు. ఆ తర్వాత కూడా వారిని తిరిగి టీకాల కార్యక్రమంలోకి తీసుకురావడంలో సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు, పట్టణాల్లోని మురికివాడలు, వలస కుటుంబాలు, ఇతర వెనుకబడిన వర్గాల పిల్లలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. టీకాలు తీసుకోని పిల్లలను గుర్తించడం, వారికి తిరిగి టీకాలు వేయించడం వంటి కార్యక్రమాలు కూడా ఆశించిన స్థాయిలో జరగలేదని సమాచారం. ఈ సమస్యలన్నీ కలసి ప్రస్తుత పరిస్థితికి కారణమయ్యాయని అధికారులు చెబుతున్నారు. దీంతో వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడంలో ఆరోగ్య శాఖకు మరింత సవాలు ఎదురైంది.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అత్యవసరంగా తట్టు టీకాల కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1.97 కోట్ల మంది పిల్లలకు టీకాలు వేసినట్లు సమాచారం. ఆ తర్వాత అదే వయసు పిల్లల్లో సుమారు 2.23 కోట్ల మందికి విటమిన్-ఎ కార్యక్రమం కూడా నిర్వహించారు. అయితే తట్టు టీకాల కార్యక్రమం కోసం మొదట నిర్ణయించిన పిల్లల సంఖ్య వాస్తవ పరిస్థితితో పోలిస్తే చాలా తక్కువగా ఉందని అధికారులు అంగీకరించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం.. పిల్లలను సకాలంలో గుర్తించి రక్షించడంలో జరిగిన ఆలస్యం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. వ్యాధి వ్యాప్తిని ముందుగానే గుర్తించి, అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. తట్టు వ్యాధి చాలా వేగంగా వ్యాపించేది.. అయినప్పటికీ.. సరైన సమయంలో టీకాలు వేయడం ద్వారా దీనిని అడ్డుకోవచ్చు.









