
US-Iran War : ఉత్తర ఇరాక్‌లో జరిగిన ప్రమాదంలో అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. కూలిపోయిన ఇరాన్ డ్రోన్‌ను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకుందని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో మరో సైనికుడికి స్వల్ప గాయాలయ్యాయని, అతను చికిత్స పొందుతున్నాడని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 17 మంది అమెరికా సైనికులు చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
దీనితో పాటు, వేరే ప్రాంతంలో అమెరికాకు చెందిన తప్పిపోయిన సైనికుల ఆచూకీ కోసం గాలిస్తుండగా, గుర్తించని కొన్ని అవశేషాలు దొరికాయని, అవి ఎవరివో నిర్ధారించే ప్రక్రియ జరుగుతోందని సైన్యం పేర్కొంది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే వరకు, వారి పేర్లను వెల్లడించడం లేదని సెంట్రల్ కమాండ్ తెలిపింది. శుక్రవారం జోర్డాన్‌లో ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకుంటూ ఇద్దరు అమెరికా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.
Also Read : మళ్ళీ ఫిఫా వరల్డ్ కప్‌ను అమెరికాలో నిర్వహిస్తాం : ట్రంప్ సంచలన ప్రకటన!
మరోవైపు, జోర్డాన్‌లో తమ సైనికుల మరణానికి ప్రతీకారంగా అమెరికా సేనలు ఇరాన్‌పై వరుసగా ఎనిమిదో రాత్రి కూడా దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే, అమెరికా దాడులకు ధీటుగా ఇరాన్ కూడా స్పందిస్తోంది. కువైట్‌లోని రెండు అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. ఇందులో భాగంగా క్యాంప్ ఉదైరిలోని మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రం, అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్‌లోని రాడార్ వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అంతేకాకుండా, కువైట్‌లోని ఒక విద్యుత్, డీశాలినేషన్ ప్లాంట్‌పై వరుసగా రెండో రోజు దాడి జరగడంతో మంటలు వ్యాపించాయి.
ఈ ఉద్రిక్తతల మధ్య బహ్రెయిన్ కూడా స్పందిస్తూ, తమపైకి వచ్చిన ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. అటు జోర్డాన్‌లో కూడా ఇరాన్ క్షిపణిని జోర్డాన్, ఇజ్రాయెల్ దళాలు కలిసి అడ్డుకున్నాయి. ఇజ్రాయెల్ సైనిక అధికారి ఒకరు మాట్లాడుతూ, తమ దేశంలో మరిన్ని అమెరికా యుద్ధ విమానాలకు ఆశ్రయం కల్పించేందుకు, ఇరాన్‌పై దాడులను మరింత విస్తృతం చేసేందుకు సిద్ధమవుతున్నామని సంకేతాలిచ్చారు. ఈ దాడులు కొనసాగితే అమెరికాకు తగిన బుద్ధి చెప్తామని ఇరాన్ అత్యున్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందం ఏమాత్రం చెల్లదని ఆయన కొట్టిపారేశారు.
Also Read : ట్రంప్ సంతకానికి విలువే లేదు: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు









