అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రాబోయే నవంబర్ మధ్యంతర ఎన్నికలను పురస్కరించుకుని అక్కడి ప్రజలకు ఓ భారీ నజరానా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధుల సభ, సెనెట్‌లలో గెలిచి కాంగ్రెస్‌పై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటే దేశంలోని ప్రతీ వయోజనుడికి 5,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 4.15 లక్షలకు పైగా) చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చారు. టెక్సాస్‌లోని డల్లాస్ వేదికగా జరిగిన రిపబ్లికన్ నేషనల్ కమిటీ మొదటి మధ్యంతర ఎన్నికల కన్వెన్షన్‌లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.డల్లాస్‌లో దాదాపు గంటన్నరకు పైగా సాగిన తన సుదీర్ఘ ప్రసంగంలో ట్రంప్ అమెరికా ప్రభుత్వాన్ని ఒక విజయవంతమైన కార్పొరేట్ కంపెనీతో పోల్చారు.

Also Read : పిల్లల్ని కనండి.. ఖర్చులన్నీ మేమే చూసుకుంటాం.. చైనా సంచలన ప్రకటన!

ఒక విజయం సాధించిన సంస్థ తన భాగస్వాములకు లాభాల్లో వాటాగా ‘డివిడెండ్’ ఎలా ఇస్తుందో.. మన దేశ ఆర్ధిక పురోగతి వల్ల వచ్చిన ప్రతిఫలాన్ని పౌరులకు అలాగే అందిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు ఆయన ‘ట్రంప్ డివిడెండ్’ అని పేరు పెట్టారు. విదేశీ దిగుమతులపై విధిస్తున్న భారీ సుంకాలు, ప్రభుత్వంలో చేపడుతున్న పొదుపు చర్యల ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా పౌరులకే పంచుతామని వెల్లడించారు. అయితే దాదాపు 27 కోట్ల మంది అమెరికా వయోజనులకు ఈ మొత్తాన్ని అందించాలంటే సుమారు 1.35 ట్రిలియన్ డాలర్ల భారం పడుతుందని.. దీనికి కాంగ్రెస్ ఆమోదం, చట్టపరమైన అనుమతులు తప్పనిసరి అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రాబోయే నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ ఈ భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ వేదికపై ట్రంప్ కేవలం 5,000 డాలర్లు నగదు పంపిణీ ప్రకటనతోనే సరిపెట్టకుండా పన్ను తగ్గింపులు, సరిహద్దు భద్రత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నియంత్రణ, విదేశీ వాణిజ్య విధానాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. తన రెండేళ్ల పాలన అమెరికా చరిత్రలోనే అత్యంత విజవంతమైనదని చెప్పుకొచ్చిన ఆయన ఓటర్లను ఉద్దేశించి ఈ ఎన్నికల బ్యాలెట్ పేపర్‌పై నా పేరు లేకపోయినా.. నేనే పోటీ చేస్తున్నట్లు భావించి రిపబ్లికన్లకు ఓటు వేయండి అని పిలుపునిచ్చారు.

నవంబర్ ఎన్నికల్లో డెమొక్రాట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికే ట్రంప్ ఈ రకమైన హామీని ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఆర్మీ సైనికులకు ‘వారియర్ డివిడెండ్’, పిల్లల కోసం ‘ట్రంప్ అకౌంట్స్’ వంటి పథకాలను తెచ్చినప్పటికీ, ఏకంగా దేశ పౌరులందరికీ ఇంత పెద్ద మొత్తంలో ఉచిత నగదు బదిలీ ఇస్తామని ఒక అధ్యక్షుడు ప్రామిస్ చేయడం అమెరికా చరిత్రలోనే మొదటిసారి. అయితే ప్రతిపక్ష డెమొక్రాట్లు దీనిని ఒక ఓట్ల గిమిక్‌గా, ఉచిత హామీగా అభివర్ణిస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Also Read : ఉబెర్‌ కీలక నిర్ణయం.. ఇక వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు బ్రేక్‌ ?