Donald Trump
Donald Trump

అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఐటీ నిపుణులు, ముఖ్యంగా భారతీయులకు బిగ్ షాక్ తగిలింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఉద్యోగ ఆధారిత వలస నిబంధనలను తీవ్రంగా కఠినతరం చేసేందుకు రెడీ అయ్యింది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఇచ్చే 60 రోజుల గడువును రద్దు చేయడంతో పాటు కొత్త H-1B వీసా పిటిషన్లపై ఏకంగా 1,03,000 డాలర్లు (సుమారు రూ. 85 లక్షలకు పైగా) ఫీజును పెంచేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

Also Read : డార్క్ వెబ్‌లో ఉగ్ర కుట్ర.. అశ్లీల సైట్లు, సీక్రెట్ యాప్‌లతో పాక్ ISI డర్టీ గేమ్!

ప్రస్తుత నిబంధనల ప్రకారం H-1B, L-1 లేదా E-3 వీసాలపై ఉండే ఉద్యోగులు ఏదైనా కారణంతో ఉద్యోగం కోల్పోతే వేరే కంపెనీలో కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా వీసా కేటగిరీ మార్చుకోవడానికి 60 రోజుల పాటు అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండే వెసులుబాటు ఉంది. అయితే DHS సిద్ధం చేసిన కొత్త ముసాయిదా ప్రతిపాదన ప్రకారం ఈ 60 రోజుల ‘సురక్షిత వ్యవధి’ని పూర్తిగా తొలగించనున్నారు. అంటే ఉద్యోగం పోయిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందే తప్ప ఇంకా పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

క్యాప్-సబ్జెక్ట్ H-1B వీసా దరఖాస్తులపై ఏకంగా 1,03,265 డాలర్ల వరకు రుసుమును విధించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమెరికాలోనే చదువుకుని F-1 విద్యార్థి వీసా నుండి H-1B కి మారే నిపుణులకు కూడా ఈ భారీ ఫీజు వర్తిస్తుంది. ఈ పెంపు ద్వారా ప్రతి ఏటా సుమారు 8.8 బిలియన్ల డాలర్ల ఆదాయం సమకూరుతుందని.. దీనిని జాతీయ భద్రత, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థల కోసం ఉపయోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే అమెరికన్ కంపెనీలు, వ్యాపార వర్గాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.

అమెరికా ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన మొత్తం H-1B వీసాల్లో 71 శాతం వీసాలను భారతీయ నిపుణులే దక్కించుకున్నారు. కాబట్టి ఈ కొత్త ప్రతిపాదనలు చట్టంగా మారితే అత్యధికంగా నష్టపోయేది భారతీయ ఐటీ ఉద్యోగులు, ఇంజనీర్లు, విద్యార్థులే. ఒకవైపు ఉద్యోగం పోతే వెంటనే దేశం దాటాలనే భయం.. మరోవైపు కంపెనీలకు స్పాన్సర్‌షిప్ భారం కానుండటంతో అమెరికాలో భారతీయుల భవిష్యత్తు ప్రమాదంలో పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read : ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం!