Congo Fire Accident : మంగళ వాయిద్యాలు, బంధుమిత్రుల కోలాహలంతో సంతోషంగా సాగుతున్న వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఆఫ్రికా దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని కిన్షాసాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Also Read : బద్ధలైన అనక్ క్రాకటౌ అగ్నిపర్వతం.. 50 వేల అడుగుల ఎత్తుకు బూడిద.. 209 విమానాలు రద్దు!

ఈ విషాద ఘటన కిన్షాసా నగరంలోని ఉత్తర భాగంలో ఉన్న లింగ్వాలా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఒక భవనంలో వివాహ వేడుక జరుగుతుండగా ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. పెళ్లి వేడుక ఉత్సాహంగా సాగుతున్న సమయంలో భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పొగ దట్టంగా కమ్ముకోవడంతో లోపల ఉన్న ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే ఆ భవనంలో ఉన్న ఇరుకైన హాలులు, చిన్న దారుల వల్ల తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది.

Also Read : జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కీలక నిర్ణయం… 4 వేల ఉద్యోగాలకు కోత

బయటకు వచ్చే దారి సరిగా లేకపోవడంతో చాలామంది లోపలే చిక్కుకుపోయారు. మంటల్లో కాలిన గాయాలతో, ఊపిరాడక కొందరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. బయటపడిన వారు గాయపడిన వారిని రక్షించేందుకు శ్రమించారు. ఈ ప్రమాదం తర్వాత దహనమైన శరీరాలు, గాయపడిన బాధితులు రోడ్డు పక్కన పడి ఉన్న దృశ్యాలు అక్కడ నెలకొన్న తీవ్ర విషాదాన్ని కళ్లకు కట్టాయి.

లింగ్వాలా ప్రాంత మేయర్ నార్బర్ట్ ముషింగా ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 22 మంది మరణించినట్లు తెలిపారు. అయితే గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎక్కువ మంది ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఘటనా స్థలాన్ని కాంగో ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి జాక్వెమిన్ షబానీ సందర్శించారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనే దానికి సంబంధించి కచ్చితమైన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక వంట చేసే సమయంలో మంటలు అంటుకున్నాయా అనే కోణంలో ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.