
Ukrainian : రష్యాతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్కు భారీగా నిధులు అవసరమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధానికి అవసరమైన డబ్బును సమకూర్చుకునేందుకు ఉక్రెయిన్ ఓ కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తోంది. దేశంలో ప్రస్తుతం చట్టవిరుద్ధంగా ఉన్న పోర్నోగ్రఫీ, అంటే అశ్లీల కంటెంట్కు సంబంధించిన రంగాన్ని చట్టబద్ధం చేయాలని ఆలోచిస్తోంది.
ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యుడు యారోస్లావ్ జెలెజ్నియాక్ ఈ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నారు. దేశంలోని అడల్ట్ ఎంటర్టైన్మెంట్ రంగాన్ని చట్టబద్ధమైన వ్యాపారంగా మార్చి, దానిపై పన్నులు వసూలు చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని ఆయన చెబుతున్నారు. ఈ రంగం ద్వారా సుమారు 2.5 కోట్ల డాలర్లు, అంటే 25 మిలియన్ డాలర్ల వరకు పన్ను ఆదాయం రావచ్చని జెలెజ్నియాక్ అంచనా వేస్తున్నారు. ఆ డబ్బుతో దాదాపు 30 వేల డ్రోన్లు కొనుగోలు చేసి యుద్ధంలో ఉపయోగించవచ్చని ఆయన చెబుతున్నారు. ఉక్రెయిన్లో పార్లమెంట్ ఆర్థిక కమిటీకి జెలెజ్నియాక్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ప్రస్తుతం ఉక్రెయిన్లో పోర్నోగ్రఫీని తయారు చేయడం, దగ్గర ఉంచుకోవడం లేదా ఇతరులకు పంపిణీ చేయడం చట్టవిరుద్ధం. నేరం తీవ్రతను బట్టి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే చట్టం ఉన్నప్పటికీ దేశంలో అడల్ట్ కంటెంట్ రంగం పూర్తిగా ఆగిపోలేదు. రహస్యంగా ఈ రంగం కొనసాగుతూనే ఉందని కథనం పేర్కొంది. కొంతమంది అవినీతి పోలీసుల సహకారంతో ఈ వ్యాపారం నడుస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇటీవల ఉక్రెయిన్ అధికారులు అడల్ట్ కంటెంట్ తయారు చేసే వ్యక్తుల నుంచి పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన సమస్య ఏర్పడింది. వారు తమ ఆదాయాన్ని ప్రభుత్వానికి ప్రకటిస్తే పన్నులు కట్టాల్సి ఉంటుంది. కానీ అదే సమయంలో వారు చట్టవిరుద్ధమైన పోర్నోగ్రఫీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని కేసులు ఎదుర్కొనే పరిస్థితి వస్తోంది. దీనిపై జెలెజ్నియాక్ మాట్లాడుతూ.. వీరు పన్నులు కట్టకపోతే పన్ను ఎగవేత కేసులు ఎదుర్కోవాలి. పన్నులు కడితే పోర్నోగ్రఫీ చట్టాన్ని ఉల్లంఘించారని కేసులు ఎదుర్కోవాలి. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అని చెప్పారు.









