Nepal Floods : నేపాల్‌లో సంభవించిన అకస్మాత్తు వరద విలయంలో చిక్కుకుపోయిన వారిలో పలువురు తెలంగాణకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. సుమారు 23 మంది అమెరికాతో పాటు ఇతర దేశాల పౌరసత్వం కలిగిన ఎన్‌ఆర్‌ఐలు ఈ వరదల్లో చిక్కుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. కాగా సంబంధిత ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించిన వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో చాలామంది నేపాల్‌-టిబెట్‌ మీదుగా మానస సరోవర్‌ యాత్రకు వెళ్తున్నవారితో పాటు, తిరిగొస్తున్న వారు ఉన్నారని తెలుస్తోంది. వీరంతా ఈషా ఫౌండేషన్, ఈషా గ్రూప్, కైలాశ్‌ జర్నీ ప్రైవేట్‌ లిమిటెడ్, టచ్‌ కైలాశ్‌ తదితర ట్రావెల్స్, పర్యాటక ఏజెన్సీల సహకారంతో మానస సరోవర్‌ యాత్రకు వెళ్లినట్లు గుర్తించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వద్ద నమోదైన రికార్డుల ప్రకారం హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి వీరంతా ఈ యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో 14 మందికి అమెరికా పౌరసత్వం ఉండగా… న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల పౌరసత్వం ఉన్నవారు ఒక్కక్కరు చొప్పున ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణైంది, మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉందని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ అధికారులు వెల్లడించారు.

Also Read : పొంచి ఉన్న జలవిలయాలు.. ప్రమాదకరస్థాయిలో 88 హిమానీనదాలు..

కాగా, తెలంగాణ హైదరాబాద్‌ నుంచి యాత్రకు వెళ్లిన వారిలో కొంతమంది వివరాలు సంబంధితులు తెలిపారు. వారిలో అమెరికా పౌరసత్వం ఉన్న వందన చంద్, శ్వేత పుట్టా, సాయిప్రసాద్‌ సోమయాజులు, లక్ష్మీనాథ్‌ గోపిశెట్టి, సుధీంద్ర యాపాల్పర్వీ, సుధీర్‌ రంగు, కేశవ్‌రావు తాడిపత్రి, వివేక్‌ శంకర్‌ శ్రీవాస్తవ్, వెంకటరమణ, బాలసుబ్రహ్మణ్యం, వెంకటకృష్ణ, రఘునాథరావు, క్రితికుమార్‌ ఆచార్య. ఉన్నారు. అలాగే ఆగస్త్య గోపికృష్ణనాయుడు(ఆస్ట్రేలియా), వినయ్‌కుమార్‌రెడ్డి(కెనడా), సుహాసినిరెడ్డి కందిమల్ల(న్యూజిల్యాండ్‌)తోపాటు గాయత్రి భరత్‌(శర్మ ట్రావెల్స్‌ కైలాస్‌), నాగజ్యోతి లోల్ల తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.

చాలామంది వివరాలు తెలియాల్సి ఉండగా వారి వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసింది. నేపాల్‌ విలయంలో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు ఈ కంట్రోల్‌ రూం ద్వారా సంప్రదింపులు చేసి వివరాలు వెల్లడించడం తెలుసుకోవడం చేయవచ్చని తెలిపింది. దీనికోసం రాష్ట్ర సచివాలయంలో సంప్రదించాల్సిన నంబర్లు.. ఎస్‌.లక్ష్మీనారాయణ(సహాయ కార్యదర్శి) 98853 71189, కె.శ్రీనివాస్‌రెడ్డి(సెక్షన్‌ అధికారి) 79979 59754, ఇ.చిట్టిబాబు(సెక్షన్‌ అధికారి) 94408 54433. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లు.. 98719 99044, 99493 51270, 96185 97969. సంప్రదించాలని సూచించింది.

Also Read : నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఈశ ఫౌండేషన్ బృందం..80 మంది గల్లంతు?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.