Rains
Rains

Telangana Rains : గడచిన వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, రాబోయే మూడు రోజులు కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్‌ కూడా ఉంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చాలాచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశాలు ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ రోజు అంటే ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలతోపాటు.. కరీంనగర్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హన్మకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

పలు ప్రాంతాల్లో వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు రావొద్దని అధికారులు స్పష్టం చేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే ఉండాలని అధికారులు సూచించారు.

ఇక హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం తరువాత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శనివారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో పలు ప్రాంతాల్లోని రహదారులు జలమయం అయ్యాయి. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.