
Nalgonda : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి (48) దారుణ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ హత్య వెనుక అదే స్కూల్‌కు చెందిన ముగ్గురు పదో తరగతి మైనర్ విద్యార్థుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. రూపారెడ్డి స్కూల్లోనే చదువుతున్న ముగ్గురు మైనర్ విద్యార్థులు గంజాయి వ్యసనానికి బానిసలయ్యారు. ఇటీవల స్కూల్ ప్రాంగణం సమీపంలో వారు గంజాయి సేవిస్తుండగా ప్రిన్సిపల్ రూపారెడ్డి చూసి తీవ్రంగా మందలించారు. అంతేకాకుండా, వారు గంజాయి తాగుతున్న దృశ్యాలను ఆమె తన మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. ఈ వీడియో ఎక్కడ బయటపెడుతుందో, తమ భవిష్యత్తు ఎక్కడ పాడవుతుందోననే కోపంతో, భయంతో ఆ విద్యార్థులు ఆమెపై కక్ష పెంచుకున్నారు.
రూపారెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు పక్కా రెక్కీ నిర్వహించారు. పోలీసులకు ఎక్కడా తమ వేలిముద్రలు, ఆధారాలు దొరక్కూడదని హ్యాండ్ గ్లౌవ్స్, మాస్కులు ధరించి ఇంట్లోకి చొరబడ్డారు. కేవలం 9 నిమిషాల వ్యవధిలోనే అత్యంత దారుణంగా ఆమె శరీరంపై ఏకంగా 27 సార్లు చాకుతో పొడిచి ప్రాణాలు తీశారు. హత్య చేసిన అనంతరం, ఆ గంజాయి వీడియో ఉన్న ఐఫోన్‌తో పాటు ఇంట్లోని రూ. 4 లక్షల నగదును తీసుకుని అక్కడ నుంచి పరారైనట్లు సమాచారం.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన మైనర్ల వెనుక ఇంకా ఎవరైనా పెద్దల హస్తం ఉందా? లేదా మరేదైనా ఆర్థిక, కుటుంబ వివాదాల కోణం ఉందా? అనే విషయాలపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. గంజా కింగ్‌పిన్స్ ప్రమేయంపై కూడా కోణాల్లో విచారణ సాగుతోంది. త్వరలోనే ఈ హత్య కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.









