Rythu Bima :  తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఏటా అమలు చేసే రైతు బీమా పథకానికి ప్రీమియం చెల్లించే గడువు నిన్నటితో ముగిసినప్పటికీ, ప్రభుత్వం నిధులు కట్టకపోవడంతో ఈ పథకం సేవలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు భూమి ఉన్న రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేది. కానీ ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో ఈ సేవలు అధికారికంగా ఆగిపోయాయి.

అయితే రైతు బీమాను ఆపేయడానికి వెనుక ఒక కారణం ఉందని ప్రభుత్వం చెబుతోంది. కేవలం రైతులకే కాకుండా రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికి బీమా సదుపాయం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రైతు బీమా స్థానంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అనే కొత్త ప్లాన్‌ను తీసుకువస్తోంది. ఈ పథకంలో భాగంగా ఇంటి పెద్ద లేదా సంపాదించే వ్యక్తి చనిపోతే, ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల సాయం అందిస్తుంది.

Also Read : నాణ్యతలో రాజీ పడొద్దు… రూ.వెయ్యికోట్లతో గోదావరి పుష్కరాలు….. మంత్రి శ్రీధర్‌ బాబు

ఈ కొత్త ఇందిరమ్మ బీమా పథకాన్ని నవంబర్ 19 నుంచి అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనికోసం ప్రభుత్వం రూ.4,000 కోట్ల నిధులను కేటాయించింది. అయితే రైతు బీమా ఇప్పుడు ఆగిపోవడం, కొత్త పథకం నవంబర్‌లో ప్రారంభం కానుండటంతో.. ఈ మధ్యలో ఉన్న కొన్ని నెలల్లో చనిపోయే రైతుల కుటుంబాలకు బీమా డబ్బులు రావని రైతులు ఆందోళన చెందుతున్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ 2018 ఆగస్టు 14న ఈ రైతు బీమా పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే, ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా తక్షణ సహాయం అందించడమే ఈ పథకం ఉద్దేశం. మరణించిన రైతు నామినీ (బ్యాంక్ ఖాతాలో రూ. 5,00,000 నేరుగా జమ అయ్యేలా డిజైన్ చేశారు.

రైతుల నుంచి రూపాయి కూడా వసూలు చేయకుండా, రూ. 2,500 వరకు ఉండే వార్షిక ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నేరుగా చెల్లించేది.18 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉండి, పట్టాదారు పాసుపుస్తకం కలిగిన రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఈ పథకం అమలులోకి వచ్చిన నాటి నుంచి వేలాది బాధిత రైతు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించి నిలబెట్టింది.

Also Read : స్మార్ట్ రేషన్ కార్డులపై రాజకీయ రగడ.. భట్టి.. ప్రధాని ఫోటో పెట్టాలంటూ…

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.