Konda Surekha :ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలవడానికి వెళ్లిన మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌ చాట్‌ గా మాట్లాడిన ఆమె రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాపై చర్య తీసుకునే ముందు క్రమశిక్షణ చర్య అంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై తీసుకోవాలన్నారు. ఎవరిని అడిగి ముఖ్యమంత్రి టికెట్లు ప్రకటిస్తున్నారని ప్రశ్నించారు. ఆయనకు ఏ హక్కు ఉందని పరకాల అభ్యర్థిని ప్రకటిస్తారన్నారు. ఆయన పదేళ్లు తానే ముఖ్యమంత్రిని అని చెప్పుకోవడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు రాదా అని కొండా ప్రశ్నించారు.నా కూతురును రెచ్చ గొడితే సీఎం ను విమర్శించిందని, అయినా నా కూతురు మాట్లాడిన దానికి నన్ను ఎలా బాధ్యులు చేస్తారంటూ కొండా సురేఖ ఎదురు ప్రశ్నించారు.

నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. నాపై చర్యలు తీసుకోవడానికి ముందు పార్టీ, ప్రభుత్వంలో ఇంకా చాలామందిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చాలా పెద్ద ఎత్తున అందరి పైన అవినీతి అక్రమాల ఆరోపణలు వస్తున్నాయన్నారు. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెబుతారు? వీటిపైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. మహిళలు స్వతంత్రంగా ఎదగాలని రాహుల్ గాంధీ స్వయంగా చెబుతున్నారు. బీసీ మహిళను అయిన నాపైన ఎందుకు కక్ష కట్టారని కొండా ప్రశ్నించారు. బర్తరఫ్ లాంటి చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందో నేను ఇప్పుడే చెప్పలేను. అలాంటి పరిణామాలను తెలంగాణ సమాజం సహిస్తుందని నేను అనుకోనని హెచ్చరించారు.

గతంలో బెంగళూరులోనే మల్లిఖార్జున్‌ ఖర్గేను కలిసి లేఖ రూపంలో తాను చెప్పాల్సింది చెప్పానన్నారు.ఇపుడు మళ్లీ కలిస్తే ఇదివరకే చెప్పారుగా మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారన్నారు. తన వివరణ ఖర్గే కు ఇచ్చానని స్పష్టం చేశారు. నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని మరోసారి హెచ్చరించారు. వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాను అన్నారు. పొంగులేటి, భట్టి భార్య కమిషన్ల పైన కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి దానిపైన ఎందుకు మాట్లాడటం లేదని సురేఖ ప్రశ్నించారు.చాలామంది రెడ్లు మాట్లాడితే వారి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు బీసీ మహిళను అయినందుకే తనపై కక్ష కట్టారని కొండా సురేఖ ఆరోపించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.