CM Revanth Reddy : కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపట్టి నేటికి వెయ్యి రోజులైంది.ఈ వెయ్యిరోజుల్లో కేసీఆర్‌ కోసం ప్రభుత్వం కూ,21 కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. మూసీ నదిపై మూసారాంబాగ్‌లో నిర్మించిన కొత్త హైలెవల్‌ వంతెనను ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించి అనంతరం మాట్లాడారు.

ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్‌ 1000 రోజుల్లో ఒక కోటి 24 లక్షల 40 వేల రూపాయలు జీతం తీసుకున్నారని, కానీ ప్రజలకోసం ఒక్కరోజు కూడా పనిచేయలేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి 365 రోజులు విధులకు రాకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేస్తారని రేవంత్‌ రెడ్డి అన్నారు. మరి వెయ్యి రోజులు డ్యూటీ చేయని కేసీఆర్‌ను ఏం చేయాలి అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉన్నందుకు ఇన్నిరోజులు సెక్యూరిటీ, ఇల్లు, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు తదితర వసతుల కోసం ప్రభుత్వం రూ.21 కోట్లు ఖర్చు చేసిందని రేవంత్‌ తెలిపారు. కేసీఆర్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ రాజీనామా చేయాలని కోరుతూ ప్రజలు ఊరూరా ఆందోళనలు చేపట్టాలని’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మూడు భాగాలుగా విభజించిననట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రణాళికబద్ధంగా రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామన్నారు. అంబర్‌పేటలో ఏ కార్యాలయాలూ లేవు. ఏదైనా పని కావాలంటే పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. కొంచెం వర్షం పడితే చాలు మూసారాంబాగ్‌ బ్రిడ్జి మునిగేది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కు ఈ ఈ బ్రిడ్జి కట్ట కట్టాలని ఎందుకు అనిపించలేదు? అని ఆయన ప్రశ్నించారు. మేం రెండేళ్లలోనే వంతెనను పూర్తి చేశామని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఊరవతల డబుల్ బెడ్ రూంలు కడితే ఇక్కడ ఉన్న వాళ్లకు అవి ఏం ఉపయోగపడతాయి? అని ఆయన అన్నారు. అంబర్‌పేటలో 10 ఎకరాల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. బతుకమ్మ కుంటను కబ్జా చేయడానికి ప్రయత్నం చేసింది ఎవరో తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. ఈరోజు బతుకమ్మ కుంట పేదలకు అంకితం చేశామన్నారు. విమానం నుంచి పూలు చల్లిన ఎడ్ల సుధాకర్ అనే వ్యక్తి.. మళ్లీ బతుకమ్మ కుంటను ఆక్రమించాలని చూస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఆయన వెనుక ఉన్నదెవరో ఆలోచించాలన్నారు.

హైడ్రాపై, నాపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్న రేవంత్‌ రెడ్డి కబ్జాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. 2023 డిసెంబర్‌ 7న ప్రజల ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చి 1000 రోజులు పూర్తయిందన్నారు. రేవంత్ రెడ్డిపై బురద చల్లడానికి కొన్ని అల్లరి మూకలు బయల్దేరాయని వాటికి బుద్ధి చెప్పాలన్నారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తున్నామే తప్ప వాటిలో విల్లాలు, ఫామ్‌హౌస్‌లు మేం కట్టలేదని ఎద్దేవా చేశౄరు.

మేం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ర్ట ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్నారు. ఏడో తేదీ వచ్చినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. రాష్ర్టం రాక ముందు ఉన్న రూ.70 వేల కోట్ల అప్పును.. కేసీఆర్‌ 9 ఏళ్లలో రూ.8.11 లక్షల కోట్లకు చేర్చారని ఆరోపించారు. 16 మంది సీఎంలు రూ.70 వేల కోట్లు అప్పుచేస్తే ,కేసీఆర్ ఒక్కరే రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు మధ్య మధ్యలో నన్ను బెదిరిస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా ఒకటో తేదీన జీతాలు ఇవ్వకుండా ఉన్నామా? అని ఆయన అడిగారు. ఆనాడు బీఆర్‌ఎస్‌ పరిపాలన ఎలా ఉందో.. నేడు ప్రజా పాలన ఎలా ఉందో ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలని సూచించారు.

ఉస్మానియా ఆసుపత్రి కట్టాలన్న ఆలోచన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు కానీ తాము గోషామహాల్‌ లో 2 వేల పడకలతో రూ.3000 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రిని ఆధునిక వసతులతో కడుతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తామన్నారు. సనత్‌నగర్‌ టిమ్స్‌కు మర్రిచెన్నారెడ్డి పేరు, అల్వాల్‌లో ఉన్న టిమ్స్‌కు టి.అంజయ్య పేరు, ఎల్బీనగర్‌ టిమ్స్‌కు తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు, వరంగల్‌ టిమ్స్‌కు ప్రొ.జయశంకర్‌ పేరు పెడతామని స్పష్టం చేశారు. తెలంగాణ అమరుడు శ్రీకాంత్‌చారి కుటుంబాన్ని కేసీఆర్‌ పట్టించుకోలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్‌ హయాంలో అప్పుడెపుడో 1931లో కులగణన చేశారని తెలిపారు. ఈ 100 ఏళ్లలో ఈ దేశంలో ఏ నాయకుడు మళ్లీ కుల గణన చేయాలన్న ధైర్యం చేయలేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. జనగణన, కులగణన చేస్తారా లేదా గద్దె దిగుతారా అని తెలంగాణ సమాజం ప్రధాని మోదీకి సవాల్‌ విసిరడంతో ఆయన ఈ రోజు కుల గణన చేపట్టారని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.