Medaram Mini Jatara : తెలంగాణలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క– సారలమ్మ మినీ జాతరకు తేదీలను ఖరారు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మినీ జాతర నిర్వహించనున్నట్లు గిరిజన పూజారులు తెలిపారు.

కాగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం జాతర జరగనుండగా, గత కొంతకాలంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఒక ఏడాది మినీజాతర, ఒక ఏడాది ప్రధాన జాతర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్ద జాతర నిర్వహించగా వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి 17 వ తేది బుధవారం నుండి 20వ తేదీ శనివారం వరకు నాలుగు రోజులపాటు మినీ జాతర ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మేడారం సమ్మక్క, సారలమ్మ పూజారులు వెల్లడించారు. కాగా, మేడారంలో ఆదివాసీ గిరిజన దేవతలు అయిన సమ్మక్క-సారలమ్మల మహాజాతరను ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం నిర్వహించడం ఆనవాతీగా వస్తున్న విషయం తెలిసిందే.

కాగా, మినీ జాతర తేదీలను ప్రకటించడంతో భక్తుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. ఈ నాలుగు రోజుల్లో సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు మేడారం తరలిరానున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతోంది. మినీ జాతర తేదీలు ఖరారు కావడంతో అధికారులు, పూజారులు, సంబంధిత శాఖలు భక్తులకు అవసరమైన సౌకర్యాలపై ముందస్తు దృష్టి సారించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా జాతరలో తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, వాహనాల పార్కింగ్‌, భద్రత వంటి ప్రధాన సౌకర్యాలను కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. కాగా మినీ జాతరకు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది. ప్రధాన జాతరకు కోటికి పైగా భక్తులు వస్తుండగా, మినీ జాతరకు 20 నుంచి 30 లక్షల మంది వరకు వస్తారని భావిస్తున్నారు. దీంతో మేడారం మరోసారి భక్తులతో కిటకిటలాడనుంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.