
SIR Draft Voter List : తెలంగాణలో ముసాయిదా ఓటర్ జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇందులో 73.39 లక్షల పేర్ల తొలగించినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా..2,64,87,214 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని, వారి పేర్లతో ముసాయిదా జాబితాను విడదల చేసినట్లు కమిషనర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని 73,39,234 మంది పేర్లు తొలగించినట్లు ఆయన వెల్లడించారు.
గత ఎన్నికల్లో ఉన్న మొత్తం ఓటర్లలో సుమారు 21.7 శాతం మంది పేర్లు ప్రస్తుతం జాబితాలో తొలగించినట్లు తెలుస్తోంది. అయితే వీరి పేర్లు పూర్తిగా తొలగించినట్లు కాదని.. తదుపరి విచారణ, అభ్యంతరాల ప్రక్రియకు అవకాశం ఉంటుందని సుదర్శన్ రెడ్డి వివరించారు.
Also Read : మాజీ సైనికులకు గుడ్ న్యూస్… హైదరాబాద్ సిటీ పోలీస్‌శాఖలో 150 ఎస్పీఓ పోస్టుల భర్తీ
అదే సమయంలో ముసాయిదా జాబితాలో చోటు దక్కనున్న 2.64 కోట్ల మంది ఓటర్లలో 93 లక్షల మందికి పైగా ఓటర్ల వివరాల్లో తేడాలు ఉండటం లేదా గత ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ జరగలేదని అధికారులు తెలిపారు. వీరందరినీ అనుమానాస్పద ఓటర్లుగా గుర్తించి ఈరోజు నుంచి అక్టోబర్ 15 వరకు ఈఆర్‌ఓలు నోటీసులు జారీ చేస్తారని ఆయన చెప్పారు. నోటీసులు అందుకోనున్న 93 లక్షల మందిలో 32.36 లక్షల మంది అన్‌మ్యాప్డ్ ఓటర్లు ఉన్నారు. మరో 61.4 లక్షల మంది ఓటర్ల వివరాల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను పరిశీలించిన అనంతరం అర్హత ఉన్న ఓటర్ల పేర్లను తుది జాబితాలో చేర్చనున్నారు.
SIR ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎన్యూమరేషన్ ఫారంలో 2002 నాటి ఓటర్ల జాబితాలో తమ పేరు లేదా తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రుల పేర్లు ఉన్న వివరాలను నమోదు చేయాలి. అయితే ఈ వివరాలను ఇవ్వడంలో విఫలమైన లేదా తప్పుడు వివరాలు నమోదు చేసిన 32.36 లక్షల మంది ఓటర్లను అధికారులు అన్‌మ్యాప్డ్ ఓటర్లుగా అధికారులు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో అవగాహన లోపం కారణంగా 2002 ఓటర్ జాబితా వివరాలు నమోదు చేయాల్సిన చోట ప్రస్తుత వివరాలు, ప్రస్తుత వివరాలు ఇవ్వాల్సిన చోట 2002 నాటి వివరాలను నమోదు చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇలాంటి ఓటర్లకు కూడా నోటీసులు జారీ చేస్తారు,
కాగా నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరై ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒకదాన్ని ఆధారంగా సమర్పించి తమ ఓటును నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఓటరు ఇచ్చిన వివరాలు, సమర్పించిన పత్రాలను ఈఆర్‌ఓలు పరిశీలన చేస్తారు. విచారణ అనంతరం ఈఆర్‌ఓలు సంతృప్తి చెందితే సంబంధిత ఓటర్ల పేర్లను తుది జాబితాలో చేరుస్తారు. అక్టోబర్ 19న తుది SIR ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.
Also Read : నాడు 420 హామీలు… నేడు 420 మాటలు… సీఎం రేవంత్ పై హరీశ్‌రావు సంచలన కామెంట్స్









