National Lok Adalat : తెలంగాణలో నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 3,896 సైబర్ మోసాల కేసులతో సహా మొత్తం 1.51 లక్షలకు పైగా రాజీపడదగిన (కాంపౌండబుల్) క్రిమినల్ కేసులను పరిష్కరించినట్లు తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడించింది. ఈ సెటిల్‌మెంట్ల మూలంగా సైబర్ నేరాల బాధితులకు ఏకంగా రూ.42.29 కోట్లు తిరిగి అందజేయడం జరిగిందని వెల్లడించారు. ఈ సైబర్‌ నేరాల కేసుల్లో 24,189 మంది బాధితులకు రూ.139.68 కోట్ల డబ్బు రీఫండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్‌లో రూ.42.28 కోట్లు తిరిగి అందజేయడం జరిగిందని తెలిపారు. ఇందులో హైదరాబాద్‌పరిధిలో రూ.5.02 కోట్లు, సైబరాబాద్‌పరిధిలో రూ.14.19 కోట్లు, మల్కాజ్‌గిరిలో రూ.5.27 కోట్లు రీఫండ్‌ చేసినట్లు వెల్లడించారు.

సైబర్‌ నేరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టులలో నలిగిపోతున్న కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు, కక్షిదారుల సమయం, డబ్బు ఆదా చేసే లక్ష్యంతో ఈ లోక్ అదాలత్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇరు పక్షాల మధ్య రాజీ, పరస్పర అంగీకారం ద్వారా వివిధ రకాల కేసులను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఇందుకోసం పరిష్కారానికి అర్హత ఉన్న కేసులను గుర్తించి, ఇరువర్గాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తద్వారా చాలామంది లోక్‌ ఆదాలత్‌ను ఆశ్రయించారు.

డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనను అనుసరించి, సెప్టెంబర్ 3న లోక్‌ అదాలత్‌లో ప్రారంభమైన కేసుల పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 12 వరకు కొనసాగింది. ఈ సమయంలో మొత్తం 1,51,164 కేసులు పరిష్కామైనట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 21,843 ఎఫ్‌ఐఆర్ కేసులు, 1,404 విపత్తు నిర్వహణ కేసులు, 61,052 పెట్టీ కేసులు, 62,969 మోటార్ వాహన చట్టం కేసులు తదితరాలు ఉన్నాయి. ప్రత్యేకించి, 3,896 సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం ద్వారా బాధితులకు రూ.42.29 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించారు.

ఈ కేసుల్లో భాగంగా TGCSB ద్వారా 41 మందికి రూ.10.55 కోట్లు తిరిగి చెల్లించాలరు. MRM ద్వారా 9,355 మందికి రూ.27.23 కోట్లు చెల్లించారు. కాగా జూన్ 2026 నుంచి తెలంగాణలో MRM అమలవుతున్నందున కోర్టు ఉత్తర్వులు లేకుండానే నగదు రీఫండ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. దీంతో ఇప్పటివరకు రూ.514.93 కోట్ల నగదు తిరిగి చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇక ఈ కేసుల పరిష్కారంలో హైదరాబాద్ (15,944 కేసులు), ఖమ్మం (10,955 కేసులు), గద్వాల (8,469 కేసులు), వరంగల్ (8,404 కేసులు), మల్కాజ్‌గిరి (8,109 కేసులు) తదితర పోలీస్ యూనిట్లు అత్యుత్తమ పనితీరు కనబరిచాయి. లోక్‌ అదాలత్‌లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (TGLSA), జిల్లా జడ్జిలు, మేజిస్ట్రేట్లు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు (DLSA), పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీల సమష్టి కృషితో ఇంత పెద్ద సంఖ్యలో కేసులను ఏకకాలంలో పరిష్కరించడం సాధ్యమైందని డీజీపీ వివరించారు. ఈ సమన్వయంతో కూడిన ప్రయత్నం వల్ల లోక్ అదాలత్ గొప్ప విజయాన్ని సాధించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.