
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అవలంభించిన తీరు రాష్ర్ట వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలను నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అత్యంత దురుసుగా వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్ , మంత్రులు దుర్యోధనుడు, దుశ్శాసనుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళా ఎమ్మెల్యేల బట్టలు విప్పేసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో అసలు మహిళలకు భద్రత లేకుండా పోయిందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అయిన సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిల పై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ఇదే అన్యాయం సోనియా గాంధీకి, ప్రియాంకా గాంధీకి జరిగితే రాహుల్ గాంధీ ఊరుకుంటారా అంటూ కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళా నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించాలన్నారు. బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ‘గుర్తుంచుకో రేవంత్ రెడ్డి.. ఈ మహిళల కన్నీళ్లు నిన్ను వెంటాడి త్వరలోనే సర్వనాశనం చేస్తాయి’ అంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర హెచ్చరికలు చేయడం సంచలనంగా మారింది.









