Konda Surekha : మంత్రి పదవి నుంచి తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తన వివరణ తీసుకోకుండానే ఎలా బర్తరఫ్ చేస్తారని ప్రశ్నించారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు. ఖర్గేకు తాను పూర్తి వివరణ ఇచ్చినా తనను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎవరూ అడగలేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. తాను రాజీనామా కూడా చేయలేదన్నారు. తన వివరణ తీసుకోకుండా తీసుకున్న బర్తరఫ్ నిర్ణయం చెల్లదని ఆమె తేల్చి చెప్పారు.

Also Read : అప్పుడు ఈటల.. ఇప్పుడు కొండా సురేఖ.. బీసీ నేతల బర్త్‌రఫ్!

తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై కూడా కొండా సురేఖ స్పందించారు. నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకేంటి సంబంధం? ఆమె మాట్లాడిన దానికి నన్ను ఎలా బాధ్యురాలిని చేస్తారు అని ప్రశ్నించారు. తన కుమార్తె రాజకీయంగా ఎదగాలని కోరుకోవడం తప్పు కాదన్నారు. పరకాల నుంచి తన కుమార్తె సుస్మిత టికెట్ ఆశించడం కొత్త విషయం కాదని సురేఖ చెప్పారు. పదేళ్లుగా ఆమె టికెట్ కోసం ప్రయత్నిస్తోందన్నారు. కడియం శ్రీహరి తన కూతురిని రాజకీయాల్లోకి తీసుకురాలేదా? సుస్మిత టికెట్ అడిగితే తప్పేంటి? అని ప్రశ్నించారు.

కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండటం కొత్త కాదని కూడా సురేఖ వ్యాఖ్యానించారు. అరవింద్ బీజేపీలో ఉంటే.. సంజయ్ కాంగ్రెస్‌లో లేరా? డీఎస్ ఇంట్లోనే రెండు పార్టీలు ఉన్నాయి అని ఆమె ఉదాహరణలు ఇచ్చారు. తనపై తీసుకున్న చర్యలను కొండా సురేఖ తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన పేరుతో తనపై చర్యలు తీసుకున్నప్పటికీ.. తన వైపు వివరణను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని ఆమె ఆరోపించారు. ఇప్పటికే ఖర్గేకు తన వివరణ ఇచ్చానని, అయినా తనను బలి చేశారని అన్నారు.

Also Read : మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. క్యాబినెట్ నుంచి బర్త్‌రఫ్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.