Houthi vs Saudi Arabia :యెమెన్‌లో సౌదీ అరేబియా మద్దతు ఉన్న సాయుధులు, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య జరుగుతున్న పోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది. రెండు వర్గాల మధ్య రోజు ఏదో ఒక చోట ఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హూతీ తిరుగుబాటు దారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా సౌదీ భూభాగం నుంచి సైనిక సామగ్రిని తరలిస్తున్న ట్రక్కులపై హూతీలు దాడి చేసిన ఘటన మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. దాడికి సంబంధించిన వీడియోను హూతీలు విడుదల చేయడం గమనార్హం. అల్-వదియాహ్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఈ దాడి జరిగినట్లు హూతీ మీడియా సెంటర్ తెలిపింది.

హూతీలకు సంబంధించిన మీడియా విభాగం విడుదల చేసిన వీడియోలో, సైనిక సామగ్రిని తరలిస్తున్నట్లు చెబుతున్న కొన్ని ట్రక్కులు మంటల్లో కాలుతున్న దృశ్యాలున్నాయి. ఆ ట్రక్కులు మంటల్లో చిక్కుకుని పేలుతున్న దృశ్యాలను మీడియా ప్రచారం చేసింది. ఈ దాడి సౌదీ-యెమెన్ సరిహద్దులోని అల్-వదియాహ్ క్రాసింగ్ సమీపంలో జరిగినట్లు ఆ మీడియా వర్గాలు వెల్లడించాయి. యెమెన్‌లోని హూతీలకు సంబంధించిన పలు ప్రాంతాలపై సౌదీ అరేబియా వైమానిక దాడులు చేసిందని, అందుకు ప్రతికారంగానే సౌదీపై విస్తృత దాడులు చేపట్టినట్లు హూతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీ వెల్లడించారు. అప్పటికే హూతీలు అబ్హా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, కింగ్ ఖాలిద్ ఎయిర్‌బేస్, ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం అరామ్‌కోలను టార్గెట్ చేశారు. మరోవైపు హూతీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సౌదీ మద్ధతుదారులకు ఆయుధాలు సరాఫరా చేస్తున్న ట్రక్కులను హూతీలు టార్గెట్‌ చేయడం గమనార్హం.

కాగా, హౌతీల దాడులపై సౌదీ అరేబియా తీవ్రంగా స్పందించింది తమ సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు ఎంతటి చర్యలూ తీసుకోవడానికైన వెనుకాడబోమని రియాద్ స్పష్టం చేసింది. హూతీల నుంచి ముప్పును తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని సౌదీ ఆధ్వర్యంలోని సంకీర్ణ దళాల ప్రతినిధి తుర్కీ అల్-మాలికీ హెచ్చిరించారు. మరోవైపు హూతీలు సైతం వెనక్కి తగ్గే పరిస్థితి లేదని ప్రకటించారు. సౌదీ భూభాగంలో మరింత తీవ్ర దాడులు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.