
Telangana : తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తప్పించడం ఎంతటి రాజకీయ సంచలనానికి దారితీసిందో.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం కూడా అదే స్థాయిలో చర్చకు దారితీస్తోంది.
కేసీఆర్ రెండో ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించింది. ఆ తర్వాత ఈటల టీఆర్ఎస్కు దూరమై.. చివరకు బీజేపీలో చేరడం, హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవడం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలుగా మారాయి.
Also Read : నా బర్తరఫ్ చెల్లదు.. నన్ను బలి చేశారు: కొండా సురేఖ సంచలనం!
ఇప్పుడు దాదాపు ఐదేళ్ల తర్వాత మరో మంత్రి బర్త్‌రఫ్ అంశం తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డి తొలి కేబినెట్లో మహిళా మంత్రిగా ఉన్న కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో ఆమెపై చర్యలు తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈటల రాజేందర్, కొండా సురేఖ ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు. ఇద్దరూ తమ తమ పార్టీల్లో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నాయకులే. ఒకరు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తే.. మరొకరు దేవాదాయ, అటవీశాఖ మంత్రిగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇద్దరి విషయంలోనూ పార్టీ నాయకత్వంతో విభేదాలు చివరకు మంత్రి పదవిపై ప్రభావం చూపాయి.
ఇక కొండా సురేఖ వ్యవహారం భవిష్యత్‌లో ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈటల బర్త్‌రఫ్ తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు తెలంగాణ రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు కొండా సురేఖ విషయంలో కూడా అదే తరహాలో రాజకీయ పరిణామాలు జరుగుతాయా? ఆమె భవిష్యత్ రాజకీయ అడుగులు ఎలా ఉంటాయి? అనేది చూడాల్సి ఉంది. ఆమె బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా సాగుతోంది.
మరోవైపు ఇద్దరూ బీసీ నేతలు కావడం కూడా ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయ ప్రాధాన్యతను పెంచుతోంది. తెలంగాణలో బీసీ రాజకీయాలు, సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్న సమయంలో.. ఒక బీసీ నేతను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు మరో బీసీ మహిళా నేతను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవుల నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : నిర్మల్ జిల్లాలో విషాదం… బాసర బ్రిడ్జిపై నుంచి పడి యువకుడి మృతి..









