
PM KISAN 2026 : దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 24 వ విడత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ నెలలో కిసాన్ నిధులు రైతుల అకౌంట్లో జమా చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా కిసాన్ నిధులు అకౌంట్లో పడాలంటే ఈ-కేవైసీ, ఆధార్ సీడింగ్, ల్యాండ్ సీడింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మూడు పనులు పూర్తి కాకపోతే తదుపరి విడత నిధులు నిలిచిపోయే అవకాశం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వెంటనే అన్నదాతలు సంబంధిత పనులు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
కాగా, 23వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను 2026 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పుడు దేశవ్యాప్తంగా 9.44 కోట్లకు పైగా అర్హులైన అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.18,880 కోట్లు జమ చేశారు. ఈ పథకం నిబంధనల ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు. దీంతో 24వ విడత అక్టోబర్‌లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిధుల విడుదలకు సంబంధించిన తేదీని అధికారికంగా ప్రకటించలేదు.
ఇదిలా ఉండగా, అన్నదాతలు ఈ-కేవైసీ (eKYC), ఆధార్ సీడింగ్, ల్యాండ్ సీడింగ్ పూర్తి చేసుకోవాలని, అది పూర్తి కాకపోతే తదుపరి విడత నిధులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీనికోసం రైతులు మీ సేవా, మండల వ్యవసాయాధికారి , గ్రామ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే రైతులు ఈ మూడు పనులు పూర్తయ్యాయా లేవా అనే విషయాలను ముందుగానే పరిశీలించుకోవడం మంచిది.
ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలంటే?
దీనికోసం రైతులు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌కు వెళ్లాలి. అందులో రైతులు eKYC పూర్తి చేసుకోవలసి ఉంటుంది. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ఉంటే OTP ద్వారా ఉచితంగా eKYC చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ కాకపోతే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా eKYC పూర్తి చేసుకోవలసి ఉంటుంది.
బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ చేయాల్సిందే
ఇక పీఎం కిసాన్ నిధులు డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. కేవలం బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేయడం మాత్రమే సరిపోదు. ఖాతాకు NPCI సర్వర్‌లో ఆధార్ సీడింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతులు తమ బ్యాంకు ఖాతా ఉన్న శాఖకు వెళ్లి డీబీటీ కోసం తమ ఖాతాకు ఆధార్ సీడింగ్ అయిందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ ప్రక్రియ పూర్తికాని పక్షంలో ఆధార్ సీడింగ్ చేయించుకోవలసి ఉంటుంది.
ల్యాండ్ సీడింగ్ స్టేటస్ కూడా పూర్తి చేయాలి
పీఎం కిసాన్ పథకం ప్రయోజనం పొందాలంటే రైతు పేరుపై సాగుకు అనువైన భూమి ఉండాలి. దానికి సంబంధించిన చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ రికార్డులు కూడా ఉండాలి. అలాంటి పత్రాలు ఉన్న అన్నదాతలు ల్యాండ్ సీడింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి పీఎం కిసాన్ పోర్టల్‌లోని ‘Know Your Status’ విభాగానికి వెళ్లి తనిఖీ చేసుకోవాలి. అక్కడ ల్యాండ్ సీడింగ్ ఎదురుగా ‘Yes’ ఉందా, ‘No’ ఉందా చూడాలి. No అని ఉంటే రైతులు తమ ఖతౌనీ, జమాబందీ, ఆధార్ ప్రతులతో సంబంధిత అధికారులను సంప్రదించి భూమి వివరాలను పోర్టల్‌లో అప్డేట్ చేయించుకోవలసి ఉంటుంది.
పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి..?
రైతులు తమ ఈ-కేవైసీ, ఆధార్ సీడింగ్, ల్యాండ్ సీడింగ్ వివరాలను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
pmkisan.gov.in అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో హోమ్‌పేజీలో ‘Know Your Status’పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది.
‘Get Data’పై క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై eKYC, Aadhaar Seeding, Land Seeding స్టేటస్ ‘Yes/No’ రూపంలో కనిపిస్తుంది. ఇలా అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత అన్ని సక్రమంగా ఉంటే కిషాన్ సమ్మాన్ నిధులు రైతు అకౌంట్లో జమ అవుతాయి.









