
Khairatabad Maha Ganesh 2026 :తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గడచిన 72 సంవత్సరాలుగా ఇక్కడ గణేశున్ని ప్రతిష్టిస్తున్నారు. కాగా ఈసారి 69 అడుగులతో మహాగణపతి దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పూర్తవ్వగా.. ఉత్సవ కమిటీ గణేషుడి ఆగమనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈసారి 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతి రూపంలో విగ్రహన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ నిర్వహించనున్నారు.. ఆ తర్వాతి నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీగా భక్తులు వస్తున్నారు. కాగా ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.
పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహానికి ఒకవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం.. మరోవైపు కాళీమాత విగ్రహాలు ఏర్పాటు చేశారు. కాగా, 69 అడుగుల ఎత్తైన పంచముఖ సంకటహార మహా గణపతి రూపంలో తయారు చేసిన ఈ విగ్రహ నిర్మాణం పూర్తి కావడానికి 82 రోజులు పట్టింది. ఈ రోజు భక్తుల కోలాహలం మధ్య విగ్రహం తెర తీశారు. భక్తులు గణపతిని తమ మొబైల్ కెమెరాల్లో బంధిస్తూ మురిసిపోతున్నారు. కాగా వినాయకుడికి ఐదు ముఖాలు, ఆరు చేతులు, తొండంతో కూడిన రూపం చూడచక్కగా ఉంది. ఈ భారీ విగ్రహంతో పాటు 15 అడుగుల సోమనాథ జ్యోతిర్లింగం , కాళికా మాత ప్రతిమలను కూడా ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 24 వరకు ఖైరతాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.









