
KCR : బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మరణించినవరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి కేసీఆర్ పెద్ది స్వగ్రామం నల్లబెల్లికి వెళ్లనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం గ్రామంలో నిర్వహించే సంస్మరణ సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. అలాగే సోమవారం (ఆగస్టు10) రోజున హనుమకొండలో జరిగే సంస్కరణ సభకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. కాగా ఈ సంస్కరణ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ భవన్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ సహచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పెద్ది కుటుంబాన్ని పరామర్శించడానికి రానున్న క్రమంలో ఏర్పాట్లపై కేటీఆర్ తో జిల్లా నాయకులు చర్చించారు. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి పైన తనకున్న ప్రేమను వ్యక్తం చేసిన కేసీఆర్, ఆ కుటుంబానికి తండ్రిలా అండగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆర్థికసాయం
కాగా, పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీకి చేసిన సేవలకు తోడు వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్ధేశంతో ఆ కుటుంబానికి పార్టీ తరుపున కేసీఆర్ రూ.2.25 కోట్ల ఆర్థికసాయం అందించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలవాలని తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి కేసీఆర్ అందజేయనున్నారు. సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలు, మొత్తంగా రూ.2.25 కోట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది, ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లల భవిష్యత్తు, చదువు, కుటుంబ సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉంటుందని కేసీఆర్ ఇదివరకే భరోసానిచ్చారు.
కాగా సుదర్శన్ రెడ్డి గత నెల 31న మృతి చెందిన విషయం తెలిసిందే. గత నెల 26న ఉదయం హనుమకొండలో పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఛాతీలో నొప్పి రావటంతో స్థానికంగా రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కార్డియాక్ అరెస్ట్‌గా నిర్ధారించారు. గంట సేపు శ్రమించి తొమ్మిదిసార్లు సీపీఆర్ చేశాక కొంత ఫలితం కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. యశోధలో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. 5 రోజులు మృత్యువుతో పోరాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి గత నెల 31న కన్నుమూయగా రాష్ర్టమంతా శోకసముద్రమైంది.









