
Moosarambagh Bridge : హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్..ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించడం కోసం మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.రూ.52 కోట్లతో 400 మీటర్ల పొడవు, 14.5 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ వంతెన అంబర్‌పేట–మూసారాంబాగ్ ప్రాంతాలను అనుసంధానించనుంది. అలాగే నడకదారి కోసం కోసం కూడా ఇక్కడ 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ ఏర్పాటు చేశారు. మూసీ వరదల సమయంలో రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ బ్రిడ్జిని నిర్మించారు. 2023లో బిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా అవి అర్థాంతరంగా నిలిచిపోయాయి. 2024లో మళ్లీ పనులు ప్రారంభమై.. ప్రస్తుతం నిర్మాణం పూర్తయింది.
Also Read : సిరిసిల్ల జిల్లా శివనగర్‌లో కలకలం… పెళ్లి మండపంలోనే భర్తపై భార్య దాడి
ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల రాకపోకలు సులువు కానున్నాయి. వర్షాకాలంలో మూసీ నది వరదలు వచ్చి నీటి బ్రిడ్జిపైకి చేరి ఈ మార్గంలో రాకపోకలకు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం బ్రిడ్జి అందుబాటులోకి వస్తుండడంతో ఏడాది పొడవునా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రాక పోకలు సాగించవచ్చు. ముఖ్యంగా అంబర్‌పేట–మూసారాంబాగ్ మధ్య రాకపోకలు కొనసాగించే వారికి ఇది చాలా ఉపయోగకరం. ముఖ్యంగా చాదర్‌ఘాట్ వంతెనపై వాహనాల రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాహనదారులు అంటున్నారు. అంతే కాక ఈ మార్గంలో తరచూ ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులకు ఉపశమనం లభించనుంది.
వర్షాకాలంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు నిండితే గేట్లు ఎత్తుతారు. అలా ఎత్తిన ప్రతిసారి మూసీకి వరద పెరిగి పాత బిడ్జి పూర్తిగా మునిగిపోయేది. ఆ సమయంలో బ్రిడ్జిని పూర్తిగా మూసివేసేవారు. దీంతో పదుల కిలోమీటర్లు ప్రయాణించి గమ్యా్న్ని చేరాల్సి వచ్చేది. వరదల సమయంలో మాత్రమే ప్రభుత్వాలు కొత్త బ్రిడ్జి ప్రస్తావన తెచ్చేవి. ఆ తర్వాత నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. 2023 జూలైలో జంట జలాశయాల నిండి గేట్లు ఎత్తాల్సి వచ్చింది. ఆ సమయంలో వరదలు తగ్గుముఖం పట్టేదాక మూసారాంబాగ్ బ్రిడ్జి పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు పదుల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి ఇబ్బందులు రాకుండా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని మాటిచ్చింది. అందుకు సంబంధించిన పనులను 10 రోజుల్లో ప్రారంభిస్తామని కూడా హామీ ఇచ్చింది.
కానీ క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అయితే బ్రిడ్జి కోసం టెండర్లు మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయినప్పటికీ ఆ తర్వాత ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి. అటు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024లో పనులు తిరిగి ప్రారంభించింది. పాత బ్రిడ్జి కూల్చివేత మూలంగా పనుల్లో కొంత ఆలస్యమైంది. ఈ ఏడాది పనుల్లో వేగం పెంచడంతో ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ రోజునుంచి ఈ బ్రిడ్జి వాహనదారులకు అందుబాటులోకి రానుంది.
Also Read : రాఖీ పండుగతో పాటు వీకెండ్.. సొంతూర్లకు హైదరాబాదీలు.. కిక్కిరిసిన బస్టాండ్లు









