
Vijaya Reddy : బీఆర్ఎస్ టికెట్ మీదా ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారడంతో పాటు కాంగ్రెస్ బీఫారంపై ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను హైకోర్టు అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఎంపీగా పోటీ చేసిన నాటి నుంచి ఎమ్మెల్యేగా అనర్హుడిగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచిన పీజేఆర్ కూతురు విజయా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు ప్రకారం దానం నాగేందర్ ఎన్నిక చెల్లకపోతే తనను ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.దానం నాగేందర్ ఎన్నికపై కోర్టులో పిటిషన్ వేసిన విజయా రెడ్డి మాట్లాడుతూ తన వాదనను కోర్టు పూర్తిగా విశ్వసిస్తోందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తనకు హైకోర్టు తీర్పుపై పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా విజయా రెడ్డి మాట్లాడుతూ గతంలో తను హైకోర్టులో వేసిన ఎన్నికల పిటిషన్‌పై తీర్పు రాకుండా ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదని, ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆమె ప్రస్తావించారు. ఒకవేళ తన పిటిషన్ ను పక్కన పెడితే దానికి కారణాలు ఏంటని మళ్లీ తాను కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఒకవేళ ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలని విజయా రెడ్డి అభిప్రాయపడ్డారు.
Also Read : ఏపీ బీజేపీ నేత బైక్‌కు నిప్పు.. భర్తను చంపేందుకు భార్య ప్లాన్!
కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా విజయా రెడ్డి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో దానం నాగేందర్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయా రెడ్డి దానం నాగేందర్‌పై 22,010 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత రాష్ర్టంలో జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో దానం కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఈ ఎన్నికల్లో దానం నాగేందర్ తన అఫిడవిట్లో ఆయనతో పాటు ఆయన కుటుంబు సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించకుండా దాచి పెట్టారంటూ విజయా రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయంలో దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని విజయా రెడ్డి తన పిటిషన్లో స్పష్టం చేశారు.
అయితే నాటి నుంచి ఈ పిటిషన్ పై విచారణ సాగుతూనే ఉంది. ఈ కేసు విచారణ పెండింగ్‌లో ఉండగానే దానంపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయిందంటూ ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ కూడా జారీ చేశారు. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఈ సందర్భంలో దానం నాగేందర్ ఆస్తులపై తాను దాఖలు చేసిన పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు ఈ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు నిర్వహించరాదని, అలాగే నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ విజయా రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన కోర్టు.. వచ్చే మంగళవారానికి తదుపరి విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్న కారణంగా ఖైరతాబాద్ స్థానానికి నోటిఫికేషన్ ఇవ్వబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అయితే దానం నాగేందర్ అనర్హత పిటిషన్లో కోర్టు ఆయన ఎంపీగా పోటీ చేసిన 2024 నుంచి ఆయన ఎన్నికల చెల్లదని తీర్పునిచ్చిన నేపథ్యంలో నాడు రెండవ స్థానంలో నిలిచిన విజయారెడ్డిని ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. అంతేకాదు, నాటి నుంచి ఎమ్మెల్యేగా దానం నాగేందర్ పొందిన అన్ని రకాల వెసలుబాట్లను వెనుకకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని, అవన్నీ విజయారెడ్డికి వర్తింప జేయాలన్న వాదన కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.
Also Read : ఏపీలో ఇరుముడి సినిమా రిపీట్.. అక్కడ టీచర్.. ఇక్కడ వంట మనిషి!









