హైదరాబాద్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ఆ తర్వాత అంతటి స్థాయిలో ఆకర్షించేది బాలాపూర్ గణనాథుడి 21 కిలోల లడ్డూ. ప్రతి ఏటా వినాయక నిమజ్జనం రోజు లడ్డూ వేలంపాట జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన వేలం పాటలో గతేడాది నమోదైన రూ.35 లక్షల ఆల్ టైమ్ రికార్డును తిరగరాస్తూ.. ఏకంగా రూ. 39 లక్షల భారీ ధరకు అమ్ముడైంది. అయితే అన్ని గణేష్ లడ్డూల కంటే బాలాపూర్ గణేష్ లడ్డూ ఎంతో ప్రత్యేకమైనది. ఈ లడ్డూను వేలంలో దక్కించుకోవాలని ఎందరో ప్రయత్నిస్తుంటారు. బాలాపూర్ గణేశుడి చేతిలో విశేష పూజలందుకున్న 21 కిలోల బంగారు పూత పూసిన లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోవడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, వ్యాపారాల్లో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఈ నమ్మకం ఊరికే రాలేదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది.

1994లో మొదటిసారిగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఈ లడ్డూ వేలం పాటను ప్రారంభించింది. అప్పుడు లో కొలను మోహన్ రెడ్డి అనే స్థానిక రైతు కేవలం రూ. 450 లకు ఈ లడ్డూను దక్కించుకున్నారు. ఆయన ఈ లడ్డూను తమ కుటుంబ సభ్యులు, బంధువులకు పంచడమే కాకుండా, మిగిలిన ప్రసాదాన్ని తన వ్యవసాయ పొలంలో చల్లారు. విచిత్రంగా ఆ సంవత్సరం ఆయన పొలంలో ఊహించని స్థాయిలో మంచి పంట దిగుబడి వచ్చి, సిరిసంపదలు లభించాయి. ఈ సంఘటనతో లడ్డూ ప్రసాదంపై భక్తులకు నమ్మకం రెట్టింపైంది. నాటి నుంచి నేటి వరకు ఈ లడ్డూ చేతికి దక్కితే తిరుగులేని అదృష్టం, అభివృద్ధి కలసివస్తుందనే బాలాపూర్ సెంటిమెంట్ భక్తులలో బలంగా పాతుకుపోయింది.

30 ఏళ్ల కిందట కేవలం రూ. 450 తో అతిసాధారణంగా ప్రారంభమైన ఈ వేలం పాట ప్రస్థానం, ఏటికేటికీ సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ రూ.39 లక్షల స్థాయికి చేరింది. వేలం ప్రారంభమైన తొలి 15 ఏళ్ల పాటు కేవలం బాలాపూర్ గ్రామ స్థానికులకు మాత్రమే వేలంలో పాల్గొనే వెసులుబాటు ఉండేది. 2009లో ఉత్సవ సమితి నియమావళిని మార్చి, బయటి వ్యక్తులకు కూడా అవకాశం కల్పించింది. దీంతో పోటీ ఒక్కసారిగా విపరీతంగా పెరిగి.. ఆ ఏడాది సరిత అనే మహిళ రూ. 5.10 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. 32 ఏళ్ల చరిత్రలో ఒక్క 2020లో మాత్రమే కరోనా మహమ్మారి కారణంగా వేలం పాట నిర్వహించలేదు.

Also Read : గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ గణేశుడు

లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఏం చేస్తారు?

వేలం పాట ద్వారా వసూలైన డబ్బును పూర్తిస్థాయిలో గ్రామాభివృద్ధికి, విద్యా సదుపాయాలకు, సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తారు. గ్రామంలోని హనుమాన్, వేణుగోపాల స్వామి, లక్ష్మీ గణపతి, శివాలయం, మల్లన్న మందిరం, మహంకాళి, పోచమ్మ ఆలయాల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం భారీ షెడ్డును ఏర్పాటు చేశారు. బాలాపూర్ గణేశ్ చౌక్ నిర్మాణంతో పాటు, ఉత్సవ మండప నిర్వహణ కోసం శాశ్వత స్థలాన్ని కొనుగోలు చేశారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పలు కీలక కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఉత్సవ సమితి రూ. 1.73 కోట్లకు పైగా సొమ్మును గ్రామాభివృద్ధికి ఖర్చు చేసింది. బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం సమయంలో విగ్రహంలోని ఏదో ఒక భాగాన్ని కొంతవరకు తొలగించడం చూస్తుంటాం. అయితే కొత్త విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు.. పాత విగ్రహానికి సంబంధించిన పవిత్ర మట్టిని లేదా భాగాలను కొత్త విగ్రహ తయారీలో ఉపయోగిస్తారని తెలుస్తోంది.

Also Read : ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర షురూ.. అడుగడుగునా అంబరాన్నంటిన భక్తజన కోలాహలం!