
Karimnagar: విశ్వాసానికి మారుపేరుగా నిలవాల్సిన స్నేహమే ఇక్కడ ద్రోహంగా మారింది. నమ్మిన స్నేహితుడే అర్థరాత్రి కన్నం వేసి, అత్యంత సురక్షితమని భావించి దాచుకున్న భారీ నగదును అపహరించిన ఘటన కరీంనగర్‌లో సంచలనం సృష్టిస్తోంది. బాధితుడు అటవీశాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారి కాగా, నిందితుడు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌కు చెందిన గుడిమల్ల శ్రీనివాస్ అటవీశాఖలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ (DRO)గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి, మల్లేశ్వరీనగర్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఆయన భార్య సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండటంతో, శ్రీనివాస్ వారానికి ఒకసారి మాత్రమే ఆమె వద్దకు వెళ్తుంటారు. మిగిలిన రోజుల్లో తీగలగుట్టపల్లిలోని ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నారు.
శ్రీనివాస్ ఇటీవల తన స్వగ్రామంలో ఉన్న ఒక ఎకరం వ్యవసాయ భూమిని రూ. 26 లక్షలకు విక్రయించారు. ఆ భారీ నగదును బ్యాంకులో డిపాజిట్ చేయకుండా, తీగలగుట్టపల్లిలోని తన అద్దె ఇంటికి తీసుకువచ్చారు. ఇంట్లో నగదు ఉంటే దొంగల భయం ఉంటుందని భావించిన ఆయన, ఎవరికీ అనుమానం రాని విధంగా, అత్యంత సురక్షితమైన ప్రదేశంగా బాత్రూంను ఎంచుకున్నారు. అక్కడ ఉన్న ఖాళీ నీళ్ల డ్రమ్ములో ఒక అట్టపెట్టె పెట్టి, అందులో రూ. 26 లక్షల నగదును దాచారు.
Also Read : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. జలకళను సంతరించుకున్న జలాశయాలు
జూన్ నెలలో అత్యవసరంగా డబ్బు అవసరం పడటంతో శ్రీనివాస్ తన అద్దె గదికి వచ్చి బాత్రూంలో తనిఖీ చేశారు. డ్రమ్ములో దాచిన నగదు మాయమవ్వడం, బాత్రూం తాళం పగులగొట్టి ఉండటం చూసి ఆయన షాక్‌కు గురయ్యారు. అయితే, ఆ సమయంలో ఆయన భార్య అనారోగ్యంతో ఉండటంతో, ఈ వార్త తెలిస్తే ఆమె మరింత ఆందోళన చెందుతుందనే ఉద్దేశంతో మొదట పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ, అదే సమయంలో కింది అంతస్తులోనూ ల్యాప్‌టాప్ చోరీకి గురవ్వడంతో, రెండు దొంగతనాలు ఒకరే చేసి ఉంటారని శ్రీనివాస్ అనుమానించారు.
తన ఇంటికి తరచుగా వచ్చి వెళ్లే స్నేహితుడు, మంథని జడ్పీటీసీ మాజీ సభ్యురాలి భర్త తగరం శంకర్ లాల్ పై శ్రీనివాస్ అనుమానం వ్యక్తంచేశారు. గతంలో వారి మధ్య ఆర్థిక లావాదేవీల వివాదం కూడా ఉందని తెలిసింది. శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కరీంనగర్ రూరల్ పోలీసులు శంకర్ లాల్ ను మంగళవారం అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో శంకర్ లాలే దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారణ అయినట్లు విశ్వసనీయ సమాచారం.
అత్యంత నమ్మకమైన స్నేహితుడు, రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి ఇలాంటి దొంగతనానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసుల అధికారిక వివరణ ఇంకా వెలువడాల్సి ఉంది.
Also Read : హైడ్రా కమిషనర్ ను తొలగించాలన్న హైకోర్టు… సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం









