Heavy Rains In Telangana : తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేశారు. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు.

ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య తెలంగాణ జిల్లాలపై వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండనుంది. వాతావరణ శాఖ పరిస్థితిని సమీక్షించి ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి , రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. ప్రజలు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, కుమురం భీమ్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజధాని హైదరాబాద్‌లోనూ ఆకాశం మేఘావృతమై ఉండి, తేలికపాటి నుండి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా, వాగులు, చెరువులు అలుగు పోస్తున్నాయి. పలు చోట్ల వరద ఉద్ధృతికి రహదారులు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Also Read : హైదరాబాద్‌ వాసులకు బిగ్ షాక్‌… 20 లక్షల ఓట్లు రద్దు? అధికారులు ఏమంటున్నారంటే?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిరికొండ మండలంలో కప్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహ ధాటికి వంతెన వద్ద ఉన్న అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పరిసర గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

వర్షాల ఉద్ధృతికి జలాశయాలు నిండి జలకళ సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి గత 24 గంటల్లో 6,585 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,395.40 అడుగులకు (7.139 టీఎంసీలు) చేరింది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్ట్‌లో 1,391.25 అడుగులు (4.597 టీఎంసీలు) మాత్రమే నీరు ఉండటం గమనార్హం.

మరొకవైపు మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌కు కూడా వరద నీటి తాకిడి పెరుగుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 27,000 క్యూసెక్కులుగా నమోదు కాగా, అవుట్‌ఫ్లో 28,000 క్యూసెక్కులుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు (9.657 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.240 మీటర్లకు (7.17 టీఎంసీలు) చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని బట్టి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

జూరాల ప్రాజెక్టుకు నిరంతరం వరద నీరు వస్తుండటంతో జలవిద్యుత్ ఉత్పత్తిని వేగవంతం చేశారు. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని మొత్తం 10 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం వీటి ద్వారా 395 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, వాగులు, నదులు దాటేందుకు ప్రయత్నించవద్దని రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ప్రజలను హెచ్చరించింది.

Also Read : ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌కృష్ణారెడ్డి అరెస్ట్‌?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.