
AV Ranganath : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏ.వీ. రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన స్థలంలోకి వెళ్లరాదన్న న్యాయస్థాన ఆదేశాలను పదేపదే ధిక్కరించడంపై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసినందుకు ఆయనను అరెస్టు చేయాలని కూడా ఒక దశలో ఆదేశించింది.
అయితే, ప్రభుత్వ న్యాయవాదులు, అడ్వకేట్ జనరల్ (AG) ఏ. సుదర్శన్‌రెడ్డి కోర్టును అభ్యర్థించడంతో అరెస్టు ఆదేశాలను ఉపసంహరించుకున్న ధర్మాసనం, రంగనాథ్‌ను సాయంత్రంలోగా వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు ఆయన సాయంత్రం 6.30 గంటలకు ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. విచారణ సందర్భంగా రంగనాథ్ వ్యవహారశైలిపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ అలవాటుపడ్డ నేరగాడిలా మారారని మండిపడింది.
మల్కాజ్‌గిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లలో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి, ‘శాంత శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ భూవివాదంలో గతంలోనే సివిల్ సూట్, మొదటి అప్పీల్‌లో ప్రభుత్వం ఓడిపోయింది. సదరు స్థలంపై తమకే పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయని, 2021లోనే హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు సదరు సంస్థ తెలిపింది.
న్యాయస్థానం ప్రైవేటు భూమిగా తీర్పు ఇచ్చినప్పటికీ, సదరు స్థలంలో ప్రభుత్వం హైడ్రా ద్వారా పదేపదే జోక్యం చేసుకుంటోందని బాధితులు ఆరోపించారు. గతంలోనే ప్రైవేటు స్థలంలోకి ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రవేశించవద్దని హైకోర్టు హెచ్చరించడమే కాకుండా, ప్రభుత్వం కూడా ఎలాంటి జోక్యం చేసుకోబోమని అండర్ టేకింగ్ ఇచ్చింది. అయినప్పటికీ అధికారులు మే చివరి నుంచి జూన్ వరకు పలుమార్లు అడ్డుకున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.
Also Read : రక్తమోడిన రహదార్లు.. నలుగురు మృతి
అన్ని రకాల కోర్టు ఉత్తర్వులు, యాజమాన్య పత్రాలు చూపించినా పట్టించుకోకుండా, జూలై 17న ఉదయం హైడ్రా అధికారులు భారీ బలగాలు, జేసీబీలతో వచ్చి ప్రహరీ గోడలు, టిన్ షీట్లు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేశారని కంపెనీ ఆరోపించింది. సీసీ కెమెరాలను కూల్చివేయడమే కాకుండా, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. నరసయ్యతో పాటు మరికొందరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్రమంగా నిర్బంధించారని తెలిపింది. ఈ నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు లంచ్ మోషన్ రూపంలో మూడోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం హైడ్రా కమిషనర్ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. “ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా (చట్టం ప్రకారం పాలన) అనేది ఒకటి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం ఎంతమాత్రం చెల్లదు. అది ప్రైవేటు భూమి అని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చినప్పుడు, ఆ తీర్పు నచ్చకపోతే చట్టప్రకారం సుప్రీంకోర్టుకు వెళ్లాలి తప్ప, భూమిలోకి వెళ్లి విధ్వంసం సృష్టించడం అరాచకం” అని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వమైనా, ప్రభుత్వాధికారులైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసిన ధర్మాసనం.. చెరువులు, నాలాల పరిరక్షణ పేరుతో కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి ప్రైవేటు భూముల్లోకి వెళ్లడాన్ని ఏ చట్టం ప్రకారం సమర్థిస్తారని నిలదీసింది. యజమాని అనుమతి లేకుండా ప్రైవేటు భూమిలో అడుగు పెట్టకూడదనే ప్రాథమిక సూత్రం తెలిసీ కూడా ఎందుకు ఉల్లంఘించారని, బాధితులపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దాని కాపీ కూడా ఇవ్వకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది.
ఇక సదరు భూమి రక్షణ శాఖకు చెందిందని అధికారులు చెబుతున్న అంశంపై కూడా ధర్మాసనం మండిపడింది. సివిల్ కోర్టు విచారణలో ఎక్కడా ప్రస్తావనకు రాని రక్షణ శాఖ అంశాన్ని ఇప్పుడు కొత్తగా ఎలా తెరపైకి తెస్తారని నిలదీసింది. రక్షణ శాఖదే అయితే వారిని కేసులో ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు అమలులో ఉండగా వాటికి విరుద్ధంగా వ్యవహరించడం న్యాయ ప్రక్రియలో నేరుగా జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేసింది.
నగరంలో ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ స్థలాల రక్షణ పేరుతో వరుస కూల్చివేతలు చేపడుతున్న హైడ్రాపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో నిబంధనలు పాటించకుండా, పరిధి దాటి ప్రైవేటు ఆస్తుల విషయంలో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు ఇంత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, కమిషనర్‌ను స్వయంగా బోనులో నిలబెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాధితుడిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని తక్షణమే అందజేయాలని ఆదేశించిన హైకోర్టు, ఈ పరిణామాలపై పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. కేసు విచారణను తదుపరి రోజుకు వాయిదా వేస్తూ, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
Also Read : ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో బిగ్ ట్విస్ట్.. అతిగా మద్యం సేవించి నాటకం..?









