
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మొత్తం ఖాళీలలో 3,100 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు ఉండగా, మిగిలిన 12,882 పోస్టులు అంగన్‌వాడీ సహాయకురాల విభాగానికి చెందినవి. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఉన్న ఈ ఖాళీలను భర్తీ చేయడానికి జిల్లాల వారీగా విడివిడిగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల కాగా.. త్వరలోనే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ప్రకటించనున్నారు.
ఈసారి అంగన్‌వాడీ నియామక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చింది. అంగన్‌వాడీ టీచర్, సహాయకుల పోస్టులకు పోటీ పడే అభ్యర్థులకు ఇదివరకు ఉన్న విద్యార్హతలను మారుస్తూ.. ఈసారి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధనను పెట్టింది. దీనితో పాటు ఎంపిక ప్రక్రియలో కొత్తగా ఇంటర్వ్యూ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే మహిళలు ఖచ్చితంగా సంబంధిత గ్రామం లేదా వార్డులో స్థానికురాలై ఉండాలి. అలాగే గిరిజన తండాలు, గూడెలలోని పోస్టులకు స్థానిక ఎస్సీ, ఎస్టీ మహిళలకే అవకాశం ఉంటుంది.
రాష్ట్రంలోని రెండు మల్టీజోన్ల పరిధిలో ఈ ఖాళీలను వర్గీకరించారు. మల్టీజోన్-1 పరిధిలో 1,853 టీచర్, 7,737 సహాయక పోస్టులతో కలిపి మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయి. అలాగే మల్టీజోన్-2 పరిధిలో 1,247 టీచర్, 5,145 సహాయక పోస్టులతో కలిపి మొత్తం 6,392 ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 192 టీచర్లు, 1,033 సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న స్థానిక మహిళా అభ్యర్థులు ఆయా జిల్లాల నోటిఫికేషన్ల షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ లేదా నిర్దేశిత పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.









