
TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో ఆర్టీసీ యాజమాన్యమే స్వయంగా చేపట్టనుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిజిఎస్‌ఆర్‌టిసి ఆధ్వర్యంలో కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం ఇదే తొలిసారి కావడంతో అభ్యర్థుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆర్టీసీలో ఏటా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విరమణ పొందుతున్నప్పటికీ, కొత్త కండక్టర్ల నియామకాలు చేపట్టకపోవడంతో డిపోల్లో ఖాళీల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో ఆర్టీసీ యాజమాన్యం కొంతకాలంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ప్రధాన డిపోలతో పాటు వివిధ జిల్లాల్లో తాత్కాలిక ప్రాతిపదికన, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించి సేవలను కొనసాగించింది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం 1,500 పర్మినెంట్ పోస్టుల భర్తీకి ఓకే చెప్పడంతో ఆర్టీసీ యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది.
ఈ కండక్టర్ ఉద్యోగాలకు ప్రధాన అర్హతగా పదో తరగతి (SSC)గా నిర్ణయించారు. రాత పరీక్ష నిర్వహించకుండా, పదో తరగతిలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా రీజియన్ల వారీగా, రోస్టర్ విధానం, రిజర్వేషన్లను పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆర్టీసీ ప్రాథమికంగా భావిస్తోంది. గతంలో కూడా ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను ఎస్సెస్సీ మార్కుల ఆధారంగానే భర్తీ చేసే ఆనవాయితీ ఉండేది.
అయితే, ఈ విడత ఎంపిక ప్రక్రియకు ‘గ్రేడింగ్ విధానం’ ఒక పెద్ద సవాలుగా మారింది. గతంలో పదో తరగతి ఫలితాల్లో మార్కుల శాతం ఉండేది, ఆ తర్వాత కొంతకాలం ప్రభుత్వం గ్రేడ్ పాయింట్ల (CGPA) విధానాన్ని అమలు చేసింది. ఆ తర్వాత మళ్లీ మార్కుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనివల్ల దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉండే అవకాశం ఉంది. ఈ రెండు వేర్వేరు విధానాల మధ్య అభ్యర్థుల ప్రతిభను సరిసమానంగా ఎలా తూచాలనే దానిపై ఆర్టీసీ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
గ్రేడ్ పాయింట్లను మార్కుల శాతంలోకి మార్చే విధానం (CGPA to Percentage conversion formula) పై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ యాజమాన్యం ఎస్సెస్సీ బోర్డుకు (రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ) లేఖ రాసింది. బోర్డు నుంచి దీనికి సంబంధించి అధికారిక సమాధానం, మార్గదర్శకాలు రాగానే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా పారదర్శకంగా కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రభుత్వ ఉచిత బస్సు ప్రయాణ పథకం (మహాలక్ష్మి) వల్ల ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, డిపోల్లో అదనపు సిబ్బంది అవసరం ఎంతో ఉంది. ఈ 1,500 కండక్టర్ పోస్టుల భర్తీ పూర్తయితే సంస్థపై పనిభారం తగ్గడమే కాకుండా, రవాణా సేవలు మరింత విస్తృతంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎస్సెస్సీ బోర్డు నుంచి స్పష్టత రాగానే త్వరలోనే ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు తేదీలతో కూడిన పూర్తి వివరాల నోటిఫికేషన్ విడుదల కానుంది.









