Hyderabad Metro : హైదరాబాద్ వాసులకు గుడ్‌ న్యూస్‌… మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో తరచూ ప్రయాణించే నగరవాసులకు ఇది నిజంగా తీపికబురే అని చెప్పాలి. నగర ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ- హైదరాబాద్ మెట్రో ఉమ్మడి పాసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఉమ్మడి పాస్‌ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించడం గమనార్హం. ఈ పాసులు నెలవారీతో పాటు రోజువారీ విధానంలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ మేరకు సంజయ్ జాజు మెట్రో, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఉమ్మడి పాస్ జారీ చేయడానికి సాంకేతిక పరంగా సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఉమ్మడి చార్జీలను త్వరితగతిన ఖరారు చేసి వెంటనే పాస్ ల విధానాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

కాగా ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ, మంత్లీ, డైలీ ఛార్జీల వివరాలపై త్వరలోనే నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ, మెట్రో అధికారుల సమావేశం అనంతరం.. ఉమ్మడి చార్జీలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఉమ్మడి పాస్ విధానం అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌లో రోజూ బస్సు, మెట్రో సేవలను వినియోగించే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఒకే పాస్‌తో రెండు రకాల ప్రజా రవాణా సేవలను వినియోగించుకునే అవకాశం ఉండటంతో ప్రయాణం మరింత సులభం కావడంతో పాటు ఛార్జీల భారం కూడా తగ్గే అవకాశం ఉందని ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.