Gig Workers : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న రాష్ట్రంలో గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వారి  సంక్షేమం, సామాజిక భద్రతకు సంబంధించి  ప్రభుత్వం త్వరలోనే నిబంధనలు జారీ చేయడానికి సిద్దమైంది. ‘తెలంగాణ ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్‌ వర్కర్ల బిల్లు-2025’ను ఇదివరకే శాసనసభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి నియమ నిబంధనలు జారీ చేయనుంది. తద్వారా చట్టం అమలుకు మార్గం సుగమం కానుంది. ఈ మేరకు శక్తి (స్కిల్‌ హ్యూమన్‌ క్యాపిటల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ట్రైనింగ్‌ ఇనిషియేటివ్స్‌) శాఖ అవసరమైన ఏర్పాట్లు చేస్తోందని అధికారలు వెల్లడించారు. గిగ్‌ వర్కర్లకు సంక్షేమ పథకాలు అందించేందుకు శక్తి శాఖ మంత్రి నేతృత్వంలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ చట్టం అమలులోకి వస్తే.. కార్మికులకు సామాజిక భద్రత, బీమా పథకాలకు ప్రభుత్వం సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి, ప్లాట్‌ఫాం ఆధారిత సంస్థల నుంచి నిధికి చెల్లింపులు జరిగేలా చూడనుంది.  దీనికోసం 60 రోజులకోసారి గిగ్‌ వర్కర్ల వివరాల్లో మార్పులు, చేర్పులను అగ్రిగేటర్లు బోర్డుకు అందజేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం కార్మికులకు ఉపాధి భద్రత కల్పించేందుకు వీలుగా వారం రోజుల ముందు నోటీసు లేకుండా వర్కర్లను తొలగించడానికి వీల్లేదనే ప్రధాన నిబంధనను చేర్చింది. ఈ చట్టం కార్మికులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడడంతో పాటు, ఎవరైనా కార్మికులు వినియోగదారులను భౌతిక, మానసిక వేధించినట్లు రుజువైతే వర్కర్లను ఎలాంటి నోటీసు లేకుండా తొలగించవచ్చని సంస్థలకు చట్టం సూచిస్తోంది.

Also Read : పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలాన్ని ఒడిచిపట్టిన గళం “గద్దర్”

అయితే గిగ్ వర్కర్లు అందరూ ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకోవలసి ఉంటుంది. అలా నమోదు చేసుకున్న  ప్రతి గిగ్‌ కార్మికుడికి రిజిస్ట్రేషన్‌ ఐడీతోపాటు సామాజిక భద్రతా పథకాలు అమలవుతాయి. గిగ్‌ వర్కర్లకు అగ్రిగేటర్లు చేసిన చెల్లింపులపై 1-2% సంక్షేమ నిధికి బదిలీ చేస్తారు. దీనికోసం ప్రభుత్వం కార్పస్‌ నిధిని ఏర్పాటు చేసి ఆ పథకాలను అమలు చేయనుంది. ప్లాట్‌ఫామ్స్‌ తప్పనిసరిగా కార్మికులకు చేసే చెల్లింపులు, మినహాయింపుల వివరాలను ఆయా సంస్థలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఎవరైనా అగ్రిగేటర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లు ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే రూ.50 వేల వరకు జరిమానా  విధించేలా నిబంధనలు పొందుపరిచింది.
మూడు లక్షల మందికి మేలు

తెలంగాణలో వివిధ రంగాల్లో సుమారు 3 లక్షల మంది గిగ్‌ వర్కర్లు పనిచేస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. వీరికి ఉద్యోగ భద్రత, బీమా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఆర్డర్లపై ఆధారపడుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సకాలంలో సేవలు అందించే క్రమంలో పలువురు వర్కర్లు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2024 డిసెంబరు 23న కార్మికశాఖ, ప్లాట్‌ఫాం ఆధారిత సంస్థలు, అగ్రిగేటర్లు, కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు, డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు గిగ్‌ వర్కర్లకు అవసరమైన పథకాల అమలుకు వీలుగా కార్మికశాఖ ముసాయిదా బిల్లును 2025 ఏప్రిల్‌ 14న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  ప్రజలు, అగ్రిగేటర్లు, ప్లాట్‌ఫాం సంస్థల నుంచి వచ్చిన 250కిపైగా విజ్ఞాపనలు, అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం .. తగిన మార్పులు చేసి ఈ బిల్లును ఆమోదించింది. కాగా, కర్ణాటక, రాజస్థాన్, ఝార్ఖండ్, బిహార్‌ల తర్వాత గిగ్‌ వర్కర్లకు భద్రత కల్పించిన ఐదో రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.

Also Read : రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 52 కాలేజీల గుర్తింపు రద్దు?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.