
Hyderabad Fake Rapido Driver : హైదరాబాద్ అనగానే అర్థరాత్రి కూడా సందడిగా ఉండే ప్రాంతాలే గుర్తుకు వస్తాయి. అందులోనూ ప్రస్తుతం నగరమంతా బోనాల పండుగ సందడి నెలకొంది. ఇక నగరంలోని చార్మినార్ వంటి చారిత్రక కట్టడాల వద్ద నిరంతరం సందడి నెలకొంటుంది. అలాంటి కట్టడం వద్ద ఒక యువకుడు రాపిడో డ్రైవర్‌ను అంటూ ఓ యువతిని మోసం చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే ఆ యువతి అప్రమత్తత, సమయస్ఫూర్తితో యువకుడు నీళ్లు నమలడమే కాకుండా, అక్కడినుంచి జారుకున్నాడు. ఈ తతంగాన్నంతా ఆమె రికార్డు చేయడమే కాకుండా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
Also Read : మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
View this post on Instagram
సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి 9 గంటల సమయంలో.. సిద్ధేశ్వరి సుగంధ్ (సిద్ధి) అనే యువతి చార్మినార్ ప్రాంతంలో షాపింగ్ చేయడానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లడానికి ఆటో కోసం వెయిట్ చేస్తోంది. సిద్ధి స్వయంగా కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తుంది. వాతావరణ చల్లగా ఉండటంతో కుర్తీ, షాలువా కప్పుకుని నిలబడి ఉన్న ఆమె వద్దకు ఓ వ్యక్తి స్కూటర్‌పై వచ్చి ఆగాడు. “మ్యామ్.. ఎక్కడికి వెళ్లాలి? రాపిడో కావాలా? డ్రాప్ చేయమంటారా?” అంటూ ఆమెతో మాటలు కలిపేందుకు ప్రయత్నించాడు.
అయితే వచ్చిన వ్యక్తి బండికి నెంబర్ ప్లేట్ లేకపోవడం, తను ఎలాంటి రాపిడో బుక్ చేయకుండానే అతను వచ్చి అడగడంతో సిద్దికి అనుమానం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిద్ధేశ్వరి అసలు తాను ఎలాంటి రాపిడో రైడ్ బుక్ చేసుకోకుండా ఇతను అలా వచ్చి ఎందుకు అడుగుతున్నాడో అనే అనుమానంతో వెంటనే ఆమె తన మొబైల్ ఆన్ చేసి రికార్డింగ్ ఆన్ చేసింది. అతడిని, అతడి వాహనాన్ని మరోసారి గమనించింది. ఆ స్కూటర్‌కు కనీసం నంబర్ ప్లేట్ కూడా లేదు. దీంతో వెంటనే తేరుకుని “బండికి నంబర్ ఏది? నీ రాపిడో డ్రైవర్ ఐడీ కార్డు చూపించు” అని సిద్ధి గట్టిగా నిలదీసింది. దీంతో కంగారుపడిన ఆ వ్యక్తి నీళ్లు నములుతూ, ఐడీ కార్డు చూపించమంటే.. అప్పటికప్పుడు తన ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి రాపిడో యాప్ డౌన్లోడ్ చేయడం ప్రారంభించాడు.
సిద్ది గట్టిగా నిలదీసేప్పటికీ తన పేరు ఇర్ఫాన్ అని తన వ్యక్తిగత వివరాలు చూపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇంకా తప్పించుకునే అవకాశం లేకపోవడంతో బండి స్టార్ట్ కావడం లేదు మేడమ్ అంటూ ఏవో సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. దీంతో అసలు స్టార్ట్ కాని బైక్ పట్టుకుని, ఎలాంటి బుకింగ్ చేయకుండానే ప్యాసింజర్లను ఎక్కించుకోవడానికి ఎలా వస్తావని సిద్ధేశ్వరి తీవ్రంగా మందలింది. అతడి ఫోన్ స్క్రీన్ పై చూస్తే అప్పుడే ఓటీపీ అడిగే లాగిన్ పేజీ కనిపిస్తోంది. అతడు అసలు రాపిడో డ్రైవరే కాదు అని నిర్ధారణకు వచ్చిన సిద్ధేశ్వరి. “బండి నడవదు.. యాప్ లేదు.. నన్ను డ్రాప్ చేస్తావా? సిగ్గుండాలి..అంటూ ఫైర్ అయింది. అంతేకాక మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో” అంటూ ఆ గట్టిగా హెచ్చరించడంతో ఆ కేటుగాడు అక్కడ నుంచి నీళ్లు నములుతూ జారుకున్నాడు.
Also Read : తెలంగాణలో కోటికి పైగా ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
అలర్ట్‌గా ఉండండి.. స్పందించిన రాపిడో సంస్థ
ఈ విషయాన్నంతా రికార్డు చేసిన సిద్ధేశ్వరి సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది వెంటనే వైరల్ అయింది. రాత్రి 9 గంటల సమయంలో ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఒక మహిళ వద్దకు వచ్చి రైడ్ ఆఫర్ చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె తన పోస్టులో పేర్కొంది. కాగా, తాను రాపిడో యాప్‌ను క్రమం తప్పకుండా వాడుతుంటానని, సంస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని కూడా వెల్లడించింది, కేవలం రాపిడో పేరును వాడుకుని మోసం చేసే ఇలాంటి నకిలీ వ్యక్తుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండడానికే ఈ వీడియో చేసినట్లు ఆమె పేర్కొంది.
కాగా, సిద్ధేశ్వరి పెట్టిన వీడియోపై రాపిడో కంపెనీ కూడా వెంటనే స్పందించింది. సిద్ధేశ్వరి అప్రమత్తతను అభినందించింది. అంతేకాక యాప్‌లో రైడ్ బుక్ చేయకుండా నేరుగా వచ్చి రైడర్లమని చెప్పే వారిని అస్సలు నమ్మవద్దని తేల్చి చెప్పింది. ప్రయాణికులు ఎల్లప్పుడూ యాప్‌లోని డ్రైవర్ ఐడీ, వాహనం నంబర్, ఓటీపీ సరిచూసుకున్న తర్వాతే వారితో ప్రయాణించాలని సూచించింది.









