
Pocharam Srinivasa Reddy : బాన్సువాడ నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలోనే నిజమైన అభివృద్ధి జరిగిందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నం పెట్టిన వాళ్లను నేను ఎప్పటికీ మర్చిపోలేను. కొంతమంది దౌర్భాగ్యుల వల్లే నేను పార్టీ మారాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికోసమే తాను పార్టీ మారానని, మాజీ సీఎం కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఆయన వాపోయారు. తాను కాంగ్రెస్ జెండాను కాదని, కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు చెక్ డ్యాం వద్ద నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయంశంగా మారింది.
Also Read : రాపిడో డ్రైవర్‌ను అంటూ యువతికి బురిడీ….ఆమె ఇచ్చిన షాక్‌కు పరార్..
తాను పార్టీ మారితే ఆరు నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ కండువా కప్పుకున్నాక సగం నిధులు మాత్రమే మంజూరు చేశారని పోచారం కీలక ఆరోపణలు చేశారు. బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు అభివృద్ధి పనులను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారన్నాడు ఆనాడు. నేను నీకు అమ్ముడుపోయానా? లేక నా ఎమ్మెల్యేగిరిని కొన్నావా ? అని సీఎం ను సూటిగా నిలదీసినట్లు పోచారం వెల్లడించారు. బాన్సువాడ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కోరినా నేటికీ ఫలితం లేకపోయిందన్నారు. చివరికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా తమ ఫోన్లు ఎత్తడం లేదని పోచారం ఫైర్ అయ్యారు.
కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఏనాడు మరిచిపోనని, అన్నం పెట్టిన వాళ్లను తానెప్పుడూ మర్చిపోనని తెలిపారు. కానీ, నియోజకవర్గానికి రావాల్సిన పనుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ అడుగు పడిందని తన ఆవేదనను వెళ్లగక్కారు. అయితే, నియోజకవర్గ పెండింగ్ నిధులు, అభివృద్ధి పనుల గురించి అడిగేందుకు తాను స్వయంగా ప్రయత్నించినప్పటికీ సీఎం గానీ, సంబంధిత మంత్రులు గానీ ఏ ఒక్కరూ తన ఫోన్ కాల్స్ ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అధికారుల, నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి నిలిచిపోయిన పరిస్థితి ఉన్నప్పటికీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, రాబోయే రోజుల్లో బాన్సువాడలో మళ్లీ మనమే గెలుస్తామని పోచారం ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోచారం చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ పార్టీలో.. రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
Also Read : సమగ్ర సర్వే(సర్)తో హైదరాబాద్ లో 40లక్షల ఓట్లు రద్దు ?









