
SIR : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(సర్) లో భాగంగా నగరంలో పెద్ద ఎత్తున ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో చేపట్టిన సమగ్ర సర్వే కార్యక్రమం సోమవారం ముగియనుంది.కాగా శనివారం సాయంత్రం వరకు తేలిన లెక్కల ప్రకారం రాష్ర్ట రాజధానిలో ఉన్న మూడు జిల్లాల్లోని 28 నియోజకవర్గాల్లో 1.14 కోట్ల మంది ఓటర్లుండగా.. అందులో 40లక్షల ఓట్లు రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆది, సోమవారాల్లో ప్రభుత్వ సెలవు ప్రకటించినప్పటికీ బీఎల్వో (బూత్ స్థాయి అధికారి) నుంచి ఉన్నతాధికారుల వరకు విధుల్లో అందుబాటులో ఉంటారని, ఇంకా ఎన్యుమరేషన్ ఫారాన్ని అందించని వారు వెంటనే సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ కోరారు. మరోవైపు 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
సనత్‌నగర్‌లో సగం ఓట్లు గల్లంతు
నగరంలోని సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,54,030 ఓట్లు ఉండగా, అందులో 1.16 లక్షల ఓట్లు (45.68శాతం) రద్దు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) పరిధిని దృష్టిలో ఉంచుకుంటే.. చేవెళ్ల, కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో రద్దయ్యే ఓటర్ల సంఖ్యను మినహాయించాల్సి ఉంటుంది. మిగిలిన 25 నియోజకవర్గాల్లో తక్కువగా ఇబ్రహీంపట్నంలో 21.43, బహదూర్‌పురలో 22.38 శాతం ఓట్లు రద్దు కానున్నాయి. రాబోయే రెండ్రోజుల్లో ఈ సంఖ్య 1శాతం పెరగడం లేదా తగ్గడం జరగవచ్చని, బోనాల పండుగ ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో హెచ్చుతగ్గులు ఉండవని అధికారులు భావిస్తున్నారు.
ఏ జిల్లాలో ఎన్ని తగ్గుతాయంటే..
హైదరాబాద్ జిల్లా విషయానికి వస్తే ముషీరాబాద్ నియోజకవర్గంలో -39.77, మలక్‌పేట్‌లో- 33.92, అంబర్‌పేట్‌లో- 36.17, ఖైరతాబాద్‌లో-36.78, జూబ్లిహిల్స్‌లో- 44.21, సనత్‌నగర్‌లో- 45.68, నాంపల్లిలో- 31.33, కార్వాన్- 33.23, గోషామహల్లో- 39.38, చార్మినార్‌లో- 32.49, చాంద్రాయణగుట్టలో- 32.57, యాఖుత్పురలో- 31.40, బహదూర్‌పుర-లో 22.38, సికింద్రాబాద్‌లో- 38.47, కంటోన్మెంట్లో35.31 శాతం ఓట్లు తగ్గే అవకాశం ఉంది.
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో- 21.43, ఎల్బీనగర్లో- 42.19, మహేశ్వరంలో- 40.03, రాజేంద్రనగర్‌లో- 38.14, శేరిలింగంపల్లిలో- 36.60, చేవెళ్లలో 19.31, కల్వకుర్తి-లో 11.65, షాద్‌నగర్‌లో- 14.56 ఓట్లు గల్లంతవ్వనున్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్- 29.30, మల్కాజిగిరిలో- 37.30, కుత్బుల్లాపూర్‌లో 35.99, కూకట్పల్లి-లో 32.81, ఉప్పల్‌లో 40.05 శాతం ఓట్లు రద్దు అయ్యే అవకాశం ఉంది.
నగరంపై ప్రభావం
దేశం నలువైపుల నుంచి నగరానికి రోజూ వేలాది మంది ఉపాధి కోసం వలస వస్తుంటారు. వారంతా కొంతకాలం తర్వాత స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నగరంలో కూడా ఓటరు గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఓటరు సర్వే జరుగుతుండటంతో.. రెండు ఓట్లు కలిగిన ప్రజలు నగరంలో తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులకు తిరిగివ్వలేదు. సొంతూరిలో ఓటు హక్కును కొనసాగించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో శివారు నియోజకవర్గాలు, ప్రధాన నగరంలో లక్షల మంది ఫారాలను అధికారులకు సమర్పించలేదు. కొన్ని ఘటనల్లో.. అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. ఇంకా తమకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదని చెబుతోన్న ఓటర్లూ లక్షకుపైగా ఉన్నారు. అలాంటి వారంతా ఆన్లైన్లో ఫారాన్ని నింపాలని తద్వారా ఓటు హక్కు పొందాలని అధికారులు సూచిస్తున్నారు.









