
CM Revanth Reddy : హైదరాబాద్‌లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి, భూమిపూజ నిర్వహించారు. నగరం మొత్తంలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే మొదటి విడతలో 12 వేల ఫ్లాట్లతో ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కూకట్‌పల్లి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ పరిధిలో కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తామని, చెరువులను బాగు చేస్తామని చెప్పారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకు, తమ రెండేళ్ల పాలనకు తేడా ఏంటో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం ఇస్తే కోళ్లకు దాణాగా వేసుకునేవారు. కానీ ఈనాడు మా ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం ఇస్తోంది. వాటితో తల్లులు తమ చంటి పిల్లలకు అన్నం తినిపిస్తున్నారు అని సీఎం రేవంత్ అన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గ్రూప్-1 నియామకాలను పట్టించుకోలేదని, ఒకసారి పరీక్ష పెట్టినా ప్రశ్నపత్రాలను పల్లీలు, బఠానీల లాగా అమ్మేశారని విమర్శించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అర్హత లేని ఆర్‌ఎంపీ వైద్యుడిని సభ్యుడిగా చేశారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే TGPSC ని ప్రక్షాళన చేసి, విద్యావంతులను నియమించామని చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయించాలని సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, తాము మంచి లాయర్లను పెట్టి పోరాడి ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామని స్పష్టం చేశారు. అలాగే గ్రూప్-2, 3, 4 పోస్టులను కూడా కోర్టు సమస్యలను దాటుకుని భర్తీ చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.









