CM Revanth Reddy :  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. లండన్ పర్యటన ముగించుకుని, అక్కడి నుంచి అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన వేళ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయన యూఎస్ పర్యటనకు రాజకీయ కారణాల రీత్యా అనుమతి నిరాకరించినట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. విదేశీ పర్యటనలో భాగంగా అధికారిక బృందం లండన్ చేరుకున్న తర్వాత ఈ నిరాకరణ విషయం వెలుగులోకి వచ్చింది.

అమెరికాలో హార్వర్డ్, ఎంఐటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పాటు న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీఎం పాల్గొనాల్సి ఉంది. అయితే అనుమతి లభించకపోవడంతో లండన్ నుంచి బాస్టన్ వెళ్లాల్సిన సీఎం పర్యటన రద్దయింది. ఆయన ఆగస్టు 23న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, క్రీడా ప్రతినిధులతో సమావేశాలు యథాతథంగా జరుగుతాయని తెలిపారు. సీఎం పర్యటన రద్దయినప్పటికీ, రాష్ట్ర అధికారుల బృందం అమెరికా వెళ్లి నిర్దేశించుకున్న ఒప్పందాలు భాగస్వామ్య ప్రక్రియలను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Also Read : బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ.. మల్లు రవికి సంచలన లేఖ!

గతంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ వంటి విపక్ష నాయకుల విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతి నిరాకరించడం పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్యటనకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం.

తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతో తన పర్యటనను అడ్డుకోవడం ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కేంద్రం తెచ్చిన నూతన విద్యా విధానాన్ని తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేయడమే తన పర్యటన ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఐవీ లీగ్ విద్యాసంస్థలను హైదరాబాద్‌కు, తెలంగాణకు తీసుకురావడం కోసమే తాను ఈ పర్యటన ప్లాన్ చేశానని చెప్పారు. విదేశాల్లో లభించే నాణ్యమైన విద్యను మన తెలంగాణలోని సామాన్య విద్యార్థులకు అందించాలనేది తన ఆశయమని పేర్కొన్నారు. తన అమెరికా టూర్ రద్దయినప్పటికీ, రాష్ట్ర అధికారుల బృందాన్ని మాత్రం అమెరికా పర్యటనను కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Also Read : పాకిస్తాన్‌కు భారత్ బిగ్ షాక్: ఢిల్లీలో బారికేడ్ల తొలగింపు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.