Keyaa Banerji :  భారత పవర్‌లిఫ్టర్‌ కీయా బెనర్జీ 2026 ఐపీఎఫ్ వరల్డ్ సబ్-జూనియర్, జూనియర్ క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. 21 ఏళ్ల కీయా 140 కిలోల బరువును ఎత్తి డెడ్‌లిఫ్ట్‌లో భారత్‌కు రజత పతకం సాధించింది. ఆమె ఎత్తిన బరువు.. తన శరీర బరువుకు మూడు రెట్లకుపైగా ఉండటం విశేషం. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

అయితే ఈ విజయంతో వచ్చిన గుర్తింపు ఆమెకు మరోవైపు తీవ్ర ఇబ్బందులు తెచ్చింది. సోషల్ మీడియాలో తనకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని కీయా తెలిపింది. తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారని, తన కులం, ప్రాంతం, కుటుంబ నేపథ్యంపై అసభ్యకరమైన చర్చలు చేస్తున్నారని చెప్పింది. అన్నింటికంటే దారుణంగా.. తన ముఖం, శరీర ఫొటోలను మార్ఫింగ్ చేసి వేల సంఖ్యలో ఏఐ ఫొటోలు తయారు చేస్తున్నారని వెల్లడించింది.

రోజూ నిద్రలేచిన వెంటనే తన సోషల్ మీడియా ఫీడ్‌లోనే కాకుండా, తనకు తెలిసిన ప్రతి ఒక్కరి ఫీడ్‌లోనూ తన నకిలీ ఏఐ ఫొటోలు కనిపించడం చాలా భయంగా, ఇబ్బందిగా ఉందని కీయా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెప్పింది. కీయా తనకు మొదటి నుంచీ సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడం పెద్దగా ఇష్టం ఉండదని తెలిపింది. తాను చాలా ప్రైవేట్‌గా ఉండే వ్యక్తినని, తన పాత అకౌంట్‌ను ఫాలో అయినవారికి కూడా ఈ విషయం తెలుసని చెప్పింది. ఆ అకౌంట్‌కు కేవలం 300 మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ దాన్ని సస్పెండ్ చేసిందని తెలిపింది. అందుకే కొత్త అకౌంట్‌ తెరవాల్సి వచ్చిందని చెప్పింది.

తనకు ఇష్టం లేకపోయినా కొత్త అకౌంట్‌ను పబ్లిక్‌గా పెట్టాల్సి వచ్చిందని కీయా తెలిపింది. తన క్రీడ, తన విజయాల గురించి ఇతరులు తప్పుడు కథనాలు చెప్పకుండా తాను కూడా మాట్లాడేందుకు, తనకు తాను మద్దతుగా నిలబడేందుకు ఇదే మార్గమని చెప్పింది. మళ్లీ తన అకౌంట్ సస్పెండ్ అవుతుందేమోనన్న భయం కూడా ఉందని తెలిపింది. పవర్‌లిఫ్టింగ్ తన జీవితంలో తనను తాను పరీక్షించుకునేందుకు, సరదాగా చేసే ఒక క్రీడ మాత్రమేనని కీయా చెప్పింది. తాను ఈ స్థాయిలో పోటీ పడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. కానీ తన అనుమతి లేకుండా తన ఫొటోలతో ఏఐ పోస్టర్లు తయారు చేసి ఎక్కడ చూసినా కనిపించేలా చేయడం మాత్రం తనకు చాలా బాధ కలిగించిందని పేర్కొంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.