Jammu And Kashmir :  దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే జమ్మూకశ్మీర్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా ఉగ్రవాద కమాండర్ ఆబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు షోపియాన్‌లోని తమ ఇంటిపై జాతీయ జెండాను రెపరెపలాడించారు.

ఆబిద్ రంజాన్ షేక్ ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి. లోయలో స్థానికేతర కార్మికులపై జరిగిన పలు దాడి ఘటనల్లో ఈ ఉగ్రవాది ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి కమాండర్ ఇంటిపై ఆయన తల్లి, తండ్రి ఇద్దరూ కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం చర్చనీయాంశమైంది.

గతంలో 2021 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ తండ్రి ముజఫ్ఫర్ వానీ కూడా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఆయన తాను పనిచేస్తున్న పాఠశాలలో జెండా ఎగరేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

మరోవైపు జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ప్రసంగంలో మాట్లాడూతూ.. 2019 ఆగస్టులో రద్దయిన కశ్మీర్ రాష్ట్ర హోదాను, రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా లోక్ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమాజంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, పేదల సంక్షేమానికి పౌరులంతా ఒకటై ముందుకు సాగాలని ఆయన కోరారు.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.