
-RAVI PRAKASH
Sonam Wangchuk’s Peaceful Fast : ఇరవై రోజులు. ఒక్క మనిషి. నిరాహార దీక్ష. ఇక్కడ రాస్తారోకోలు లేవు. రాళ్లు రువ్వడాలు లేవు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం లేదు. హింస లేదు… పీస్‌ఫుల్ హంగర్ స్ట్రైక్ మాత్రమే ఉంది ! ఇరవై రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే ఒక్క ప్రశ్న గట్టిగా వినబడుతోంది. ప్రభుత్వం ఇంకా ఎందుకు మౌనంగా ఉంది అని! ఇది కేవలం సోనమ్ వాంగ్‌చుక్ స్టోరీ మాత్రమే కాదు. ఇది డెమోక్రసీ కథ. ఎందుకంటే ప్రతి ప్రజాస్వామ్యంలోనూ నిరసనలు జరుగుతాయి. ఆ నిరసనలతో విభేదించే పూర్తి హక్కు ప్రభుత్వాలకు ఉంది. ప్రభుత్వాలు ఆ డిమాండ్లను తిరస్కరించొచ్చు. ప్రభుత్వాలు చర్చలకు నో చెప్పొచ్చు. కానీ ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోతుంది. 20 రోజులుగా శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న ఒక పౌరుడితో, కనీసం మాట్లాడే ప్రయత్నమైనా చేయకూడదా? ఈ రోజు భారతదేశం అడుగుతున్న ప్రశ్న ఇదే
ఎవరు ఈ సోనమ్ వాంగ్‌చుక్? మనలో చాలా మందికి సోనమ్ వాంగ్‌చుక్ ఒక రాజకీయ నాయకుడిగా తెలియదు. సోనమ్ ఒక ఇంజనీర్ అని తెలుసు. ఒక ఇన్నోవేటర్. ఒక ఎడ్యుకేషన్ రిఫార్మర్. రామోన్ మెగ్‌సేసే అవార్డు గ్రహీత. ‘3 ఇడియట్స్’ మూవీలో ఐకానిక్ క్యారెక్టర్ ‘ఫున్సుఖ్ వాంగ్డు’ పాత్రకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ! దశాబ్దాలుగా లడాఖ్ పర్వతాల్లోనే ఉంటూ… అక్కడి విద్యా వ్యవస్థను మార్చడానికి, Pro-environment టెక్నాలజీ క్రియేట్ చేయడానికి, స్థానిక ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి సోనమ్ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. కానీ, ఈ రోజు… అదే వ్యక్తి జంతర్ మంతర్ వద్ద కూర్చున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.సోనమ్ నిరసన నీట్ వివాదానికి సంబంధించినది. లక్షలాది విద్యార్థులకు జవాబుదారీతనం దక్కాలని సోనమ్ నినాదం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, భారతదేశ పరీక్షల వ్యవస్థపై ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించాలన్నది సోనమ్ డిమాండ్ ! సోనమ్ డిమాండ్లతో ఎవరైనా ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు… కానీ ఒక వాస్తవాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు.
గత 20 రోజులుగా…ప్రజాస్వామ్యం మనకిచ్చిన అత్యంత పవిత్రమైన, శాంతియుతమైన నిరసన మార్గంలోనే సోనమ్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సోనమ్ ఆరోగ్యం క్షీణిస్తున్న కొద్దీ… ఒక అద్భుతమైన మార్పు మొదలైంది. ఎప్పుడూ ఒకరితో ఒకరు ఏకీభవించని వారు కూడా… ఇప్పుడు ఒకే మాట మాట్లాడటం మొదలుపెట్టారు. లాయర్స్. యాక్టర్స్. సైంటిస్ట్స్. పొలిటీషియన్స్. ఎన్‌ఆర్‌ఐలు… ఇలా ఒకరి తర్వాత ఒకరు… ఒకే ఒక్క విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా డిమాండ్లను ఒప్పుకోవాలని కాదు. లోంగిపోవాలని కూడా కాదు. కేవలం… చర్చలు జరపాలి. ఈ విషయంపై మొదటగా ఆందోళన చేసిన సంస్థల్లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఒకటి. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సోనమ్ చేస్తున్న దీక్ష దేశం ఖాన్సన్స్ అంటే మనస్సాక్షిని కదిలించిందని, ప్రభుత్వ , వ్యవస్థాగత మనస్సాక్షి మాత్రం, మానవీయ కోణంలో అర్థం చేసుకోలేకపోయిందని కుండ బద్ధలు కొట్టింది. ఇది అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వెంటనే… నటుడు, స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ కూడా ఈ చర్చలోకి వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే… వీర్‌దాస్ ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు. కేవలం ఒకే ఒక ప్రశ్న అడిగారు. ఒక వ్యక్తి ఇన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే… కనీసం మాట్లాడటం అంత కష్టమా? ఆ ప్రశ్న… ఇక ఎంతమాత్రం ఒక్క వ్యక్తి అడుగుతున్న ప్రశ్న కాదు. ఇప్పుడు అది దేశమంతటా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ కథ… ఇక కేవలం సోనమ్ వాంగ్‌చుక్ గురించి మాత్రమే కాదు. ఇది అంతకంటే చాలా పెద్ద విషయం.
అసలు ఒక ప్రజాస్వామ్య దేశం… శాంతియుతంగా జరుగుతున్న నిరసనతో మాట్లాడటమే మానేస్తే, ఆ వ్యవస్థ ఎటువైపు వెళ్తోంది? పాలకుల మౌనం ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుంది? ఎందుకంటే రోజులు గడుస్తున్నా… ప్రభుత్వం మౌనం మాత్రం వీడలేదు. ఈరోజు మరిన్ని గొంతులు ఈ చర్చలో తోడవుతున్నాయి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్. యాక్టర్స్. లాయర్స్. వివిధ రాజకీయ పార్టీల నాయకులు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రవాస భారతీయులు కూడా. ఒకరి తర్వాత ఒకరు! వారంతా ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఒక దేశ పౌరుడు… ఇరవై రోజులుగా ప్రాణాలను పణంగా పెట్టి, ఇంత శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తుంటే… ఒక అర్థవంతమైన చర్చను ప్రారంభించడానికి ఎందుకింత సంకోచం? ఎందుకీ మొండి మౌనం? దాదాపు మూడు వారాలుగా… సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం సోనమ్‌తో బహిరంగంగా ఎలాంటి చర్చలు జరపలేదు. కానీ జంతర్ మంతర్ లోపల మాత్రం… నినాదం రోజురోజుకూ మరింత గట్టిగా వినబడటం మొదలైంది. మొదటి గొంతు న్యాయవాద వర్గాల నుంచి వచ్చింది. ఆ తర్వాత మేధావులు. ఆ తర్వాత కళాకారులు. ఆ తర్వాత రాజకీయ నాయకులు. చివరకు… వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రవాస భారతీయుల వరకు. ఒకరి తర్వాత ఒకరు… పూర్తిగా భిన్నమైన రాజకీయ భావాలు ఉన్నవాళ్లంతా ఇప్పుడు ఒకే మాట చెప్తున్నారు. సోనమ్‌తో మాట్లాడండి.
మూవీ ఇండస్ట్రీ నుంచి దీనిపై మొదటగా స్పందించిన వారిలో సోనాక్షి సిన్హా ఒకరు. సెలబ్రిటీలు పబ్లిక్ ఇష్యూస్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని భావించే ఈ రోజుల్లో… సోనాక్షి మాట్లాడటానికి ముందుకు వచ్చారు. సోనాక్షి అభిప్రాయంతో ఎవరైనా ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు… కానీ ఈ రోజుల్లో ఒక సెన్సిటివ్ ఇష్యూపై బహిరంగంగా మాట్లాడటానికి ధైర్యం కావాలి. సోనాక్షి చేసిన విజ్ఞప్తి చాలా సింపుల్. సోనమ్ వాంగ్‌చుక్ చెప్పేది వినండి అని! ఆ వెంటనే… నటుడు అతుల్ కుల్‌కర్ణి కూడా తన మద్దతు ప్రకటించారు. అతుల్ ఎప్పుడూ ప్రజల ప్రయోజనార్థమే గళం విప్పుతూ ఉంటారు. ఈసారి కూడా… అతుల్ ఆందోళన కేవలం ఒక్క వ్యక్తి గురించి మాత్రమే కాదు. ఒక శాంతియుత నిరసన జరుగుతున్నప్పుడు, వారితో చర్చలు జరపాల్సిన అవసరం ఉందనేదే అతుల్ పాయింట్. సీనియర్ నటుడు సాయాజీ షిండే కూడా ఒక వీడియో విడుదల చేశారు. భాష వేరైనా… చూసే ప్రేక్షకులు వేరైనా… సాయాజీ షిండే సందేశం కూడా అదే. చర్చలు జరగాలి… మౌనం వీడాలి. ఈలోగా… ఈ సమస్య కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాలేదు. ఇది మెయిన్‌స్ట్రీమ్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిశారు. వాంగ్‌చుక్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని, ఈ నిరసనకు కేజ్రీవాల్ తన సంఘీభావాన్ని ప్రకటించారు. రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా… కేజ్రీవాల్ పర్యటనతో ఈ నిరసనకు జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ కూడా ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారని వేణుగోపాల్ అన్నారు. తాము కూడా కొన్ని వారాలుగా ఇదే డిమాండ్ చేస్తున్నామని గుర్తు చేశారు. అదే సమయంలో… ఆరోగ్య దృష్ట్యా దీక్ష విరమించాలని సోనమ్‌కు విజ్ఞప్తి చేస్తూ, ప్రతిపక్షంగా తాము ఈ సమస్యపై రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారు
. సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి మరింత లోతైన పాయింట్‌ను తెరపైకి తెచ్చారు. క్షీణిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై మను సింఘ్వీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఒక అర్థవంతమైన చర్చను ప్రారంభించాలని సింఘ్వీ కోరారు. కానీ దాంతో పాటు అంతే ముఖ్యమైన మరో మాట కూడా చెప్పారు. వయసు పైబడిన ఒక వ్యక్తిని ఇలా ఆమరణ నిరాహార దీక్షకు ప్రోత్సహించిన వారు కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. సింఘ్వీ మాటల్లో చెప్పాలంటే… ప్రజా సమస్యలైనా, విలువలైనా కేవలం అర్థవంతమైన చర్చలు, హేతుబద్ధమైన వాదనల ద్వారానే జరగాలి. అంతేకానీ ఒకరి ప్రాణాలను పణంగా పెట్టడం వల్ల కాదు. బహుశా… ఈ మొత్తం వివాదంలో, ఇరుపక్షాల వైపు ఉన్న లోపాలను ఎత్తిచూపిన అత్యంత Balanced Response ఇదే కావచ్చు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా సోనమ్ వాంగ్‌చుక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దేశానికి ఇంకా మీ నైతిక నాయకత్వం అవసరమని, కాబట్టి దీక్షను విరమించాలని అఖిలేష్ కోరారు. అదే సమయంలో వాంగ్‌చుక్ సత్యాగ్రహానికి మద్దతు ఇస్తూ… ఈ మౌనం ఇలాగే కొనసాగితే, ప్రపంచ దేశాల ముందు భారతదేశ Image మసకబారుతుందని అఖిలేష్ హెచ్చరించారు. ఇక, MNSచీఫ్ రాజ్ ఠాక్రే కూడా తన మద్దతు ప్రకటించారు. చూస్తూ చూస్తూనే… సోనమ్‌కు మద్దతుగా లేస్తున్న గొంతుల సంఖ్య ఒక ప్రభంజనంలా మారింది. ఎవరూ ఊహించని రీతిలో అన్ని వర్గాలూ ఒక్కటవుతున్నాయి. న్యాయవాదులు. నటులు. ప్రాంతీయ నాయకులు. జాతీయ నాయకులు. విద్యా సంస్కర్తలు. సాధారణ పౌరులు. ఎప్పుడూ ఒకే రాజకీయ వేదికపై నిలబడని వారంతా… ఈ రోజు ఒకే ఒక్క విషయాన్ని అడుగుతున్నారు. కనీసం మాట్లాడండి అని!
ఆ తర్వాత… ఈ కథ మనదేశ సరిహద్దులను దాటింది. అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుల సంస్థ… విద్యార్థులతో నిరసనకు దిగిన సోనమ్ వాంగ్‌చుక్‌తో చర్చలు జరపాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోనమ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఒక పారదర్శకమైన, సమయపాలనతో కూడిన చర్చలు జరగాలని ప్రవాస భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అప్పీల్‌తో ఎవరైనా ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు… కానీ ఈ నిరసన ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. పరిస్థితిని గమనిస్తే… తెర వెనుక ఏదో ఒక తెలియని నిశ్శబ్ద విప్లవం ముంచుకొస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ గొంతులన్నీ ఏ ఒక్క రాజకీయ పార్టీకో చెందినవి కావు. ఒకే సిద్ధాంతానికి చెందినవి కావు. కనీసం ఒకే వృత్తికి చెందినవి కూడా కావు. కానీ ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ… వారంతా దాదాపు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఒక పౌరుడు తనకున్న అత్యంత శాంతియుత మార్గంలో నిరసనను ఎంచుకున్నప్పుడు… ఒక ప్రజాస్వామ్య దేశం మానంగా ఉండిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని! ఈ ప్రశ్న ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది… ఎందుకంటే వాంగ్‌చుక్ కుటుంబం ఇలా నిరాహార దీక్షను ఎంచుకోవడం ఇది మొదటిసారి కాదు.
నాలుగు దశాబ్దాల క్రితం… సరిగ్గా ఇలాంటి క్షణాన్నే చరిత్ర చూసింది. కొన్నిసార్లు… హిస్టరీ రిపీట్ కాదు. అది కేవలం మనల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది ! ఈ రోజు జరుగుతున్న PROTESTను అర్థం చేసుకోవాలంటే… మనం 40 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. వాంగ్‌చుక్ కుటుంబంలో ఇలా నిరాహార దీక్ష చేయడం ఇదేం కొత్తకాదు. 1984వ సంవత్సరంలో ఇటువంటి సంఘటనే జరిగింది. సోనమ్ వాంగ్‌చుక్ తండ్రి సోనమ్ వాంగ్యాల్, లడాఖ్ ప్రజలకు ST హోదా కల్పించాలని నిరాహార దీక్షకు కూర్చున్నారు. లేవనెత్తిన సమస్య చాలా తీవ్రమైనది. కానీ నిరసన మాత్రం అత్యంత శాంతియుతమైనది. అప్పట్లో ఉన్న దేశ ప్రధానితో సోనమ్ వాంగ్యాల్‌కు తీవ్రమైన సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా లే వెళ్లారు. సోనమ్ వాంగ్యాల్‌ను వ్యక్తిగతంగా కలిశారు. వాంగ్యాల్ చెప్పింది ఓపికగా విన్నారు. ఆ డిమాండ్‌ను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ, వాంగ్యాల్‌కు స్వహస్తాలతో నీళ్లు అందించి దీక్ష విరమించేలా చేశారు. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఆ తర్వాత కూడా కొనసాగింది. కానీ ఆ రోజు దేశానికి అందిన సందేశం మాత్రం చాలా స్పష్టం. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం… దూరాన్ని లెక్క చేయకుండా, చర్చల మార్గాన్నే ఎంచుకుంది. ఈ రోజు ఆనాటి కథను అందరూ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. చరిత్రను బ్లైండ్‌గా కాపీ చేయాలని కాదు. లేదా ఒక ప్రభుత్వాన్ని మరో ప్రభుత్వంతో పోల్చాలని కూడా కాదు. కానీ చరిత్ర మనకు ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేస్తోంది. ప్రభుత్వాలు, పౌరులు… ముఖ్యంగా వారి మధ్య విభేదాలు ఉన్నప్పుడు కూడా చర్చలను కొనసాగించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.
Also Read : ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ చీఫ్‌పై దాడి
ఈ రోజు… నలభై రెండేళ్ల తర్వాత… భారతదేశాన్ని సరిగ్గా అలాంటి ప్రశ్నే చరిత్ర మళ్లీ అడుగుతున్నట్టు అనిపిస్తోంది. మరోసారి… వాంగ్‌చుక్ కుటుంబం నుంచే ఒక వ్యక్తి నిరాహార దీక్షలో కూర్చున్నారు. మరోసారి… ఆ నిరసన అత్యంత శాంతియుతంగా జరుగుతోంది. మరోసారి… ఆ డిమాండ్ ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదే అని ఆ నిరసనకారుడు నమ్ముతున్నారు. కానీ ఈసారి… చాలా మంది అడుగుతున్న ప్రశ్న మాత్రం వేరుగా ఉంది. అసలు ఈసారి చర్చలు జరుగుతాయా? ఎందుకంటే, ఆరోగ్యంపై ఆందోళన రోజురోజుకూ పెరగడంతో… సోనమ్ వాంగ్‌చుక్‌ను దీక్ష విరమించాలని దేశవ్యాప్తంగా చాలామంది కోరడం ప్రారంభించారు. నటులు విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు కోరారు. రాజకీయ నాయకులు అడిగారు. సాధారణ పౌరులు కూడా బతిమాలారు. కానీ సోనమ్ వాంగ్‌చుక్ స్వయంగా దీనిపై ఇప్పుడు స్పందించారు. ఒక వీడియో సందేశంలో సోనమ్ ఇలా అంటున్నారు. నా ఆరోగ్యం అంత బాగా లేదు… అలాగని మరీ ఘోరంగా కూడా లేదు. నా దీక్షను విరమించమని కోరడానికి బదులు… జులై 20న నాతో కలిసి రండని! పార్లమెంటు వైపు సాగే ఒక శాంతియుత మార్చ్‌లో భాగస్వామ్యమవ్వండని సోనమ్ పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా… సోనమ్ ఇచ్చిన సందేశం మాత్రం ఖచ్చితంగా ఆలోచించదగినది. ఎందుకంటే సోనమ్ ఎలాంటి హింసకు పిలుపునివ్వడం లేదు. ఎలాంటి ఘర్షణను కోరడం లేదు. సోనమ్ కోరుతున్నదల్లా ఒక శాంతియుత ప్రదర్శన.
సోనమ్ మాటల్లో చెప్పాలంటే… తన దీక్ష ద్వారా లేవనెత్తుతున్న ఆవేదనను మరింత గట్టిగా దేశానికి వినిపించడానికే ఈ మార్చ్. సోనమ్ అప్పీల్ సక్సెస్ అవుతుందా లేదా… సోనమ్ డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనేవి… కేవలం కాలం మాత్రమే సమాధానం చెప్పగల ప్రశ్నలు. కానీ మరో ప్రశ్నను మాత్రం మనం అస్సలు విస్మరించలేం. ఇరవై రోజులుగా… ఒక పౌరుడు ప్రజాస్వామ్యంలో ఉన్న అత్యంత పవిత్రమైన శాంతియుత నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. దేశం దీనిపై చర్చించింది. లాయర్స్. యాక్టర్స్. పొలిటీషియన్స్. ఎన్‌ఆర్ఐలు గళం విప్పారు. అంతేకాదు, సోనమ్ వాంగ్‌చుక్ మళ్లీ మాట్లాడారు. సోనమ్ వాంగ్‌చుక్ ఏం కోరుకుంటున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నకాదు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే… ఇంత జరుగుతున్నా ఎవరు వింటున్నారు? గుర్తుపెట్టుకోండి… ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు, ఎన్నికలు మాత్రమే కాదు. విబేధించే పౌరుడి గొంతును ఆ వ్యవస్థ ఎంతవరకు గౌరవించింది అనేదే అసలైన ప్రజాస్వామ్యం! బహుశా… ఈ కథ వెనుక ఉన్న అసలైన సత్యం ఇదే కావచ్చు. గడిచిన ఇరవై రోజులుగా… భారతదేశం ఒక వింతైన పరిస్థితిని చూస్తోంది. అక్కడ ఎలాంటి హింస జరగడం లేదు. ఎలాంటి అరాచకం లేదు. ఏ రాజకీయ ఘర్షణలు లేవు. కానీ, ఒక్కడంటే ఒక్క పౌరుడు… ప్రజాస్వామ్యం మనకిచ్చిన అత్యంత పవిత్రమైన ఆయుధాన్ని పట్టుకున్నాడు. అదే… నిరాహార దీక్ష!
Also Read : పెరుగుతున్న కరోనా కేసులు: మళ్లీ మాస్క్ ధరించాల్సిందేనా? డాక్లర్లు ఏం అంటున్నారంటే?
ఇప్పటికైతే… సోనమ్ డిమాండ్లు ఏంటో దేశం మొత్తం తెలిసిపోయాయి. కొందరు వాటితో ఏకీభవిస్తున్నారు. కొందరు విభేదిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని కొందరంటే… సోనమ్ వాంగ్‌చుక్ పోరాటంలో అర్థముందని మరికొందరు సమర్థిస్తున్నారు. ఆ చర్చ ఇలాగే కొనసాగుతుంది… కొనసాగాలి కూడా! ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే అది! కానీ… ఇప్పుడు అసలైన ప్రశ్న సోనమ్ డిమాండ్ల గురించి కాదు. అసలైన ప్రశ్న… ‘చర్చల’ గురించి! ఎందుకంటే ఏ ప్రభుత్వమూ అన్ని డిమాండ్లనూ ఒప్పుకోవాలని రూల్ లేదు. ఏ ప్రజాస్వామ్య దేశమూ అలా నడవలేదు కూడా. విభేదించే పూర్తి హక్కు ప్రభుత్వాలకు ఉంది. ప్రతిపాదనను తిరస్కరించే హక్కు ఉంది. తమ నిర్ణయాలను సమర్థించుకునే హక్కు కూడా ఉంది. కానీ… అత్యంత శాంతియుతంగా నిరసన తెలిపే పౌరులతో కనీసం కూర్చుని మాట్లాడే బాధ్యత లేదా? ఈ రోజు లక్షలాది భారతీయులు అడుగుతున్న ప్రశ్న ఇదే! గడిచిన 20 రోజులుగా… ఈ మౌనాన్ని వీడాలంటూ దేశంలోని అన్ని వర్గాల నుంచీ విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్. సీనియర్ న్యాయవాదులు. సినీ ప్రముఖులు. వివిధ రాజకీయ పక్షాలు… చివరకు ప్రవాస భారతీయులు. వీరిలో ఎవరి సిద్ధాంతాలు ఒకేలా లేవు. ఒకరి నిర్ణయాలతో మరొకరు అస్సలు ఏకీభవించరు. కానీ… ఈ రోజు రాజకీయాల్ని పక్కన పెట్టి, వీరంతా ఒకే మాటపై నిలబడ్డారు. వీరందరి గొంతుకల వెనుక ఉన్న డిమాండ్ ఒక్కటే! చర్చలు! లోంగిపోవాలని కాదు… రాజీ పడాలని కాదు. కేవలం… మాట్లాడండి! బహుశా అందుకే… 1984 నాటి ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. నాడు సోనమ్ వాంగ్‌చుక్ తండ్రి సోనమ్ వాంగ్యాల్ నిరాహార దీక్షకు కూర్చున్నప్పుడు… అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా లే పర్వతాల్లోకి వెళ్లారు. సోనమ్ తండ్రిని కలిశారు. రాజకీయంగా ఇందిరా గాంధీని మీరు సమర్థించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు… కానీ అది ఇక్కడ పాయింట్ కాదు. చరిత్ర ఆ సమావేశాన్ని ఎందుకు గుర్తు పెట్టుకుందంటే… అది ఒక ప్రాథమిక సత్యాన్ని నిరూపించింది. చర్చలు జరపడం అనేది బలహీనత కాదు… అది ఆత్మవిశ్వాసం! తాము తీసుకున్న నిర్ణయాలపై నమ్మకం ఉన్న ఏ ప్రభుత్వమూ… పౌరులతో మాట్లాడటానికి ఎప్పుడూ భయపడదు. ఈ రోజు… 42 ఏళ్ల తర్వాత… భారతదేశాన్ని చరిత్ర మరో ప్రశ్న అడుగుతోంది. ఇది ఏ ఒక్క ప్రభుత్వం గురించో కాదు. ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ గురించో కాదు. చివరకు ఏ ఒక్క వ్యక్తి గురించో కూడా కాదు. ఇది అసలైన ప్రజాస్వామ్యం గురించి! ఒక పౌరుడు హింసను వదిలి శాంతిని… నినాదాలను వదిలి నిశ్శబ్దాన్ని… ఘర్షణను వదిలి ఉపవాసాన్ని ఎంచుకున్నప్పుడు… ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ దానికి ఎలా స్పందించాలి?
జులై 20న పార్లమెంటుకు సాగే ఒక శాంతియుత మార్చ్‌లో పాల్గొనమని సోనమ్ చెప్తున్నారు. ఆ మార్చ్‌లో జనాలు పాల్గొంటారా లేక, సోనమ్ డిమాండ్లను చివరకు ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనేది… ప్రజలు, ప్రభుత్వం తేల్చుకోవాల్సిన విషయాలు. కానీ ఒక వాస్తవాన్ని మాత్రం ఎవరూ మార్చలేరు. ఇరవై రోజులు. ఒక శాంతియుత నిరాహార దీక్ష. దేశవ్యాప్తంగా రగులుతున్న చర్చ. కానీ, ఎప్పటికీ చెరిగిపోని ఒకే ఒక్క ప్రశ్న. ఇంత జరుగుతున్నా ఎవరు వింటున్నారు? చివరగా… ఈ రిపోర్ట్ మిమ్మల్ని సోనమ్ వాంగ్‌చుక్‌తో ఏకీభవించమని చెప్పడం లేదు. అలాగని ప్రభుత్వాన్ని వ్యతిరేకించమని కూడా అనడం లేదు. నేను అడుగుతున్నదల్లా చాలా చాలా చిన్న ప్రశ్న. చర్చలు జరపడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుందా? లేదా… చర్చలను తిరస్కరించడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని… ప్రతి పౌరుడు తన మనస్సాక్షికే వదిలేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తాయి… పోతాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుస్తాయి… ఓడిపోతాయి. ఉద్యమాలు వస్తాయి… కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ ప్రజాస్వామ్య విధానాలు అనేవి… కేవలం అక్కడ జరిగే ఎన్నికల సంబరాల వల్ల మాత్రమే చరిత్రలో నిలిచిపోవు. శాంతియుతంగా వినిపించే భిన్నాభిప్రాయాలకు, నిరసనలకు ఆ వ్యవస్థలు ఎలా స్పందించాయనే దాన్ని బట్టే అవి నిరంతరం గుర్తుంటాయి. ప్రభుత్వం ఒక డిమాండ్‌ను తిరస్కరించవచ్చు. ఒక ఉద్యమాన్ని వ్యతిరేకించవచ్చు. కానీ, చరిత్ర పేజీల్లో… పాలకులు ఎంచుకున్న చర్చల మార్గం కంటే… వారు వహించిన ఆ మొండి మౌనమే చాలా ఎక్కువ కాలం గుర్తుండిపోయే ప్రమాదం ఉంటుంది!









