
NTA : దేశంలో కీలకమైన పోటీ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీరుపై మళ్లీ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన నీట్-యుజి 2026 ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న NTA, ఇప్పుడు UGC-NET పరీక్షల్లో దొర్లిన తీవ్రమైన తప్పుల వల్ల మరోసారి ఇబ్బందుల్లో పడింది. నిర్వహించిన ప్రశ్నాపత్రాల్లో అనేక తప్పులు ఉన్నట్లు తేలడంతో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేసి, మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించింది.
Also Read : ఇన్‌స్టాలో దిమాగీ నక్సల్ పార్టీ సంచలనం.. ఒక్కరోజులోనే 1.6 లక్షల ఫాలోవర్స్!
ఇంగ్లీష్, కామర్స్ పరీక్షలను సెప్టెంబరు 9న, సోషియాలజీ పరీక్షను సెప్టెంబరు 10న తిరిగిన నిర్వహించనున్నారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవులు, పీహెచ్‌డీ ప్రవేశాలు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హతల కోసం ఎన్‌టీఏ ఈ UGC-NET పరీక్షలను నిర్వహిస్తుంటుంది.
గత జూన్‌లో 87 సబ్జెక్టులకు గానూ నిర్వహించిన ఈ పరీక్షల ఆన్సర్ కీ విడుదల ఆలస్యం కావడంపై ఇప్పటికే అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆన్సర్ కీ విడుదలయ్యాక ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లలో భారీగా తప్పులు ఉన్నాయంటూ అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఎన్‌టీఏ ఒక నిపుణుల కమిటీని వేసింది.
పరిశీలన అనంతరం ఆ మూడు పేపర్లలో ప్రముఖ పండితుల పేర్లు, పుస్తకాల పేర్లు తప్పుగా పడటం, వ్యాకరణ దోషాలు, గందరగోళంగా ఉన్న ప్రశ్నలు, అలాగే గతంలో ఇచ్చిన ప్రశ్నలనే మళ్లీ యథాతథంగా ఇవ్వడం వంటి అనేక లోపాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. పరీక్షల్లో పారదర్శకత కోసం ఈ మూడు పేపర్లకు మళ్లీ పరీక్షలు పెట్టాలని కమిటీ సూచించడంతో ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : మా కాలేజీకి రావొద్దు.. సీజేఐ రాకపై బెంగళూరులో విద్యార్థుల నిరసన!









