NEET-UG Paper Leak 2026 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి సీబీఐ దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా ప్రశ్నాపత్రం ముద్రణాలయం నుండి కాకుండా, ఎన్‌టీఏ (NTA) కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్‌లో ఉన్న ముగ్గురు నిపుణుల ద్వారా ఏప్రిల్ 2026లోనే లీకయినట్లు తేలింది. లీకయిన ప్రశ్నలను వారు రహస్య సెషన్లలో డిక్టేట్ చేసి, చేతితో రాసిన నోట్స్, ఫొటోలు,టెలిగ్రామ్ ద్వారా అభ్యర్థులకు చేరవేసినట్లు తేలింది. పేపర్‌ లీక్‌ కావడంతో మే 3న జరగాల్సిన నీట్‌ పరీక్ష రద్దై, జూన్ 21న మళ్లీ నిర్వహించిన విషయం తెలిసిందే. సీబీఐ ఛార్జ్‌షీట్ వెల్లడించిన అంశాల ప్రకారం, మనీషా గురునాథ్ మంధార (బాటనీ, జువాలజీ), ప్రహ్లాద్ విఠల్‌రావ్ కులకర్ణి (కెమిస్ట్రీ), మనీషా సంజయ్ హవాల్దార్ (ఫిజిక్స్) అనే ముగ్గురు నిపుణులు ఎన్‌టీఏ కాన్ఫిడెన్షియల్ పనుల్లో ఉండగా ప్రశ్నలను బయటకు తీసినట్లు తేలింది.

Also Read : రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్ల విరాళాలు రూ.1820కోట్లు

కెమిస్ట్రీ నిపుణుడు కులకర్ణి, బయాలజీ నిపుణురాలు మంధారలు లీకయిన ప్రశ్నల ఆధారంగా పూణేలోని తమ నివాసాలలో ప్రత్యేక రివిజన్ సెషన్లు ఏర్పాటు చేసి అభ్యర్థులకు ప్రశ్నలు, సమాధానాలను స్వయంగా నోట్ చేయించినట్లు సీబీఐ గుర్తించింది.ఇక ఫిజిక్స్ ప్రశ్నలను హవాల్దార్ పూణేలోని కోచింగ్ ఫ్యాకల్టీ తేజస్ హర్షద్‌కుమార్ షాకు డిక్టేట్ చేసినట్లు తేలింది. ఆ చేతిరాత నోట్లను షా ఫొటోలు తీసి లాతూర్ లోని రెంజాయ్ కేర్ సెంటర్ డైరెక్టర్ శివరాజ్ మోటేగాంకర్‌కు పంపినట్లు వెల్లడించారు. దానికోసం హవాల్దార్ భర్త ఖాతాకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా సీబీఐ అధికారులు గుర్తించారు. కాగా, ఎంపిక చేసిన అభ్యర్థులను లాతూర్ లోని సిద్ధివినాయక్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి, లీకైన ప్రశ్నలను వారితో కంఠస్థం చేయించినట్లు వెల్లడైంది. ఈ ప్రక్రియ అంతటికి కూడా డాక్టర్ మనోజ్ భగవాన్‌రావ్ శిరురే మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తేలింది.

ఈ దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు శిరురే కుటుంబ సభ్యుల నుండి రూ. 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. .మహారాష్ట్ర నుంచి లీకైన ప్రశ్నలు డిజిటల్ మాధ్యమాల ద్వారా రాజస్థాన్‌కు చేరినట్లు గుర్తించారు. నాసిక్‌కు చెందిన శుభమ్ ఖైర్నార్ గురుగ్రామ్‌కు చెందిన యశ్ యాదవ్‌కు టెలిగ్రామ్ ద్వారా పీడీఎఫ్ ఫైళ్లను పంపినట్లు కూడా సీబీఐ తేల్చింది. తనకు వచ్చిన ప్రశ్నలను యాదవ్ రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షలకు వాటిని జైపూర్‌కు చెందిన మంగీలాల్ బివాల్‌కు చేరవేశాడని, బివాల్ వాటిని ప్రింట్ తీసి అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. సీబీఐ స్వాధీనం చేసుకున్న నోట్‌బుక్‌లను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL), హ్యాండ్‌రైటింగ్ దర్యాప్తులో నిపుణులు పరిశీలించారు. అభ్యర్థుల వద్ద లభించిన చేతివ్రాత నోట్లలోని ప్రశ్నలను మే 3న నిర్వహించిన నీట్-యూజీ ప్రశ్నపత్రంతో పోల్చి చూడగా పూర్తిగా సరిపోలినట్లు నిర్ధారించారు. డిజిటల్ రికార్డులు, నగదు సీజ్ చేయడం ద్వారా ఈ లీకేజీ చైన్‌ను సీబీఐ చేధించింది.

కాగా, నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో మొత్తం 13 మందిపై CBI ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ముగ్గురు NTA సబ్జెక్ట్‌ నిపుణులు ఉండగా, కోచింగ్‌ సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు, మధ్యవర్తులతో పాటు, కొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నట్లు తెలిపింది. కుట్ర, మోసం, నమ్మకద్రోహం, సాక్ష్యాల ధ్వంసం, అవినీతి నిరోధక చట్టం, పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ (అక్రమ మార్గాల నిరోధం) తదితర చట్టాల కింద వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. ఈ కేసులో 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 కీలక వస్తువులను CBI స్వాధీనం చేసుకుంది.

మొత్తంగా గమనిస్తే నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ప్రశ్నపత్రం బయటకు రావడం వెనుక పెద్ద నెట్‌వర్క్‌ పనిచేసినట్లు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది. ప్రశ్నల తయారీ దశలోనే భద్రతా లోపాలు, అంతర్గత వ్యక్తుల పాత్ర, మధ్యవర్తుల నెట్‌వర్క్‌ కారణంగా ఈ వ్యవహారం చోటుచేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. అయితే సీబీఐ ఛార్జ్‌షీట్‌లోని ఆరోపణలు కోర్టు విచారణలో నిరూపణ కావలసి ఉంది.

Also Read : UPI వాడేవారికి బిగ్ షాక్: డిజిటల్ పేమెంట్లపై ఛార్జీలు వసూళ్లు!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.