sting ban

Maharashtra : స్కూలు పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ఏ స్కూలుకైనా సరే.. 500 మీటర్ల లోపల స్టింగ్ ఎనర్జీ డ్రింక్‌ను గానీ, ఇతర మత్తు పదార్థాలను గానీ అమ్మకూడదని నిషేధం విధించింది. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు ఆహార, ఔషధ పరిపాలన శాఖ మంత్రి నరహరి జిర్వాల్ ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు స్టింగ్ లాంటి ఎనర్జీ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగుతున్నారు. అయితే వీటి వల్ల పిల్లల ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుందని డాక్టర్లు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ డ్రింక్స్‌లో కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో గుండె వేగం పెరగడం, కంగారు, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తాయి. వీటిల్లో షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ. దీనివల్ల చిన్న వయసులోనే ఊబకాయం పళ్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

నిజానికి ఈ బాటిళ్ల మీద చిన్న పిల్లలు తాగకూడదు అని రాసి ఉంటుంది. అయినా సరే, స్కూళ్ల దగ్గర ఇవి విచ్చలవిడిగా దొరుకుతుండటంతో ప్రభుత్వం ఈ యాక్షన్ తీసుకుంది. స్కూళ్ల చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో ఎవరైనా స్టింగ్ లేదా ఇతర ఎనర్జీ డ్రింక్స్ అమ్మితే వారిపై ఎఫ్‌డీఏ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే నష్టాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 18 ఏళ్ల లోపు పిల్లలకు ఇలాంటి డ్రింక్స్ అమ్మకుండా చట్టం తేవాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.