Lalbaugcha Raja : వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఎన్నో గణపతి మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కానీ ముంబైలోని లాల్‌బాగ్‌చా రాజాకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గణపతిని దర్శించుకోవడానికి ముంబై నుంచే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. గంటల తరబడి, ఒక్కోసారి రోజుల తరబడి క్యూలో నిలబడి మరీ బప్పా దర్శనం చేసుకుంటారు. అందుకే లాల్‌బాగ్‌చా రాజాను ముంబైలోని అత్యంత ప్రసిద్ధ గణపతుల్లో ఒకటిగా చెబుతారు.

లాల్‌బాగ్‌చా రాజా చరిత్ర విషయానికి వస్తే దాదాపు 90 ఏళ్ల నాటిది. 1930లలో ముంబైలోని లాల్‌బాగ్‌ ప్రాంతం మిల్లులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, చేపల వ్యాపారం చేసే కుటుంబాలతో కళకళలాడేది. అక్కడి ప్రజలకు మార్కెట్‌ అనేది జీవనాధారం. అయితే 1932లో పెరూ చాల్‌ ప్రాంతంలోని మార్కెట్‌ మూతపడింది. దీంతో అక్కడ చేపలు అమ్ముకునే వారు, చిన్న వ్యాపారులు, ఇతర విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమకు మళ్లీ శాశ్వతంగా వ్యాపారం చేసుకునే స్థలం రావాలని వారు గణపతి బప్పాను ప్రార్థించారని చెబుతారు. వారి కోరిక నెరవేరి లాల్‌బాగ్‌లో మార్కెట్‌ ఏర్పడింది. ఆ తర్వాత తమ మొక్కు తీర్చుకున్నందుకు కృతజ్ఞతగా అక్కడి ప్రజలు 1934 సెప్టెంబర్‌ 12న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అదే తర్వాత కాలంలో లాల్‌బాగ్‌చా రాజాగా ప్రసిద్ధి చెందింది.

లాల్‌బాగ్‌చా రాజాకు ఉన్న మరో ప్రత్యేకమైన పేరు నవసాచా గణపతి. మరాఠీలో నవస్‌’అంటే మొక్కు అని అర్థం. తమ కోరిక నెరవేరాలని గణపతిని మొక్కుకుని.. అది నెరవేరిన తర్వాత మళ్లీ వచ్చి బప్పాకు కృతజ్ఞతలు చెప్పే సంప్రదాయం ఇక్కడ బలంగా ఉంది. కాలక్రమంలో ఈ గణపతిని తమ కోరికలు నెరవేర్చే దేవుడిగా భక్తులు నమ్మడం మొదలైంది. పిల్లలు కావాలని, కుటుంబ సమస్యలు తొలగాలని, ఉద్యోగం రావాలని, వ్యాపారం బాగుపడాలని.. ఇలా రకరకాల కోరికలతో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కోరిక నెరవేరిన తర్వాత మళ్లీ వచ్చి మొక్కు చెల్లించుకుంటారు. అందుకే నవసాచా గణపతి అనే పేరు మరింత ప్రాచుర్యం పొందింది.

లాల్‌బాగ్‌చా రాజా విగ్రహం చూడగానే ప్రత్యేకంగా కనిపిస్తుంది. రాజసంగా కూర్చున్న గణపతి రూపం, ముఖంలో ప్రశాంతత, పెద్ద కిరీటం, అలంకరణ.. ఇవన్నీ కలిసి బప్పాకు ఒక ప్రత్యేకమైన రూపాన్ని తీసుకొచ్చాయి. ఈ విగ్రహాన్ని తయారు చేసే బాధ్యత దశాబ్దాలుగా కాంబ్లీ కుటుంబం చేతుల్లోనే ఉంది. 1935 నుంచి ఈ కుటుంబం లాల్‌బాగ్‌చా రాజా విగ్రహంతో అనుబంధం కలిగి ఉందని చారిత్రక వివరాలు చెబుతున్నాయి. తరతరాలుగా ఇదే కుటుంబం విగ్రహ రూపాన్ని తీర్చిదిద్దుతూ వస్తోంది.

భక్తుల నమ్మకం ఒక్కటే.. బప్పాను దర్శించుకుంటే మనసులో కోరుకున్న కోరిక నెరవేరుతుందని. ఈ నమ్మకమే ఏటా లక్షలాది మందిని లాల్‌బాగ్‌ వైపు తీసుకువస్తోంది. అందుకే ముంబైలో ఎన్నో గణపతులు ఉన్నా.. లాల్‌బాగ్‌చా రాజా అంటే మాత్రం ప్రత్యేకమైన భక్తి, ప్రత్యేకమైన క్రేజ్. బప్పాను దర్శించుకోవడానికి గంటల తరబడి క్యూలో నిలబడే భక్తులకు అది కేవలం ఒక దర్శనం కాదు.. తమ కోరికను బప్పా ముందు చెప్పుకునే ఒక నమ్మకం.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.