
Jharkhand : ఖైదీల్లో మంచి ప్రవర్తన ఉన్న వారికి జైలు బయట పని చేసుకునే అవకాశం కల్పించేందుకు జార్ఖండ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ విధానంలో ఎంపికైన ఖైదీలు ఉదయం జైలు నుంచి బయటకు వెళ్లి పని చేసుకుని.. సాయంత్రానికి తిరిగి జైలుకు రావాల్సి ఉంటుంది.
ఖైదీలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బయట పని చేయడం ద్వారా ఉపాధి పొందడంతో పాటు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచే అవకాశం వారికి లభిస్తుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత సాధారణ జీవితానికి అలవాటు పడేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
కొత్త విధానం అమల్లోకి వస్తే ఎంపికైన ఖైదీలు ఉదయం 6 లేదా 7 గంటలకే జైలు నుంచి బయటకు వెళ్లి పని చేసుకోవచ్చు. అయితే 12 గంటల్లోపు, అంటే సాయంత్రానికల్లా తిరిగి జైలుకు చేరుకోవాలి. అయితే ఈ అవకాశం ఖైదీలందరికీ ఉండదు. ఎవరికి ఈ అవకాశం ఇవ్వాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే విషయాలను జైలు అధికారులు ప్రత్యేకంగా రూపొందించే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో నిర్ణయించనున్నారు.
జైలులో మంచి ప్రవర్తన కలిగి ఉండి, ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు సృష్టించని ఖైదీలను మాత్రమే ఈ విధానానికి ఎంపిక చేసే అవకాశం ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన ఖైదీలపై చర్యలు తీసుకుంటారు. బయట పని చేసేందుకు అనుమతి పొందిన ఖైదీలపై జైలు అధికారులు నిఘా కూడా ఉంచుతారు.









