Jharkhand : రాజకీయాల్లో నేతలకు సెంటిమెంట్లు, నమ్మకాలు కొత్తేమీ కాదు. కొన్ని ప్రభుత్వ భవనాల్లో ఉంటే పదవి పోతుందని.. మరికొన్ని ప్రాంతాలకు వెళ్తే రాజకీయ భవిష్యత్‌ దెబ్బతింటుందని నేతల్లో నమ్మకాలు ఉన్నాయి. బిహార్‌లోని కొన్ని ప్రభుత్వ బంగ్లాల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వరకు ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి. అయితే ఇవన్నీ నిజమని చెప్పడానికి ఆధారాలు లేకపోయినా.. రాజకీయాల్లో మాత్రం ఈ నమ్మకాలు చాలాకాలంగా చర్చకు వస్తూనే ఉన్నాయి.

Also Read : భర్తలకు షాక్.. పిల్లలతో కలిసి ఇద్దరు మహిళలు జంప్.. నగలు, నగదు కూడా మాయం!

ఇప్పుడు జార్ఖండ్‌లో మరో కొత్త నమ్మకం తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పదవి విషయంలో వరుసగా చోటుచేసుకున్న విషాద ఘటనలు చర్చకు దారితీశాయి. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో తొలుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న జ‌గ‌ర్నాథ్ మహతో 2023 ఏప్రిల్ 6న కన్నుమూశారు. కరోనా సమయంలో ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకింది. ఆ తర్వాత విద్యాశాఖ బాధ్యతలను రామ్‌దాస్ సోరెన్‌కు అప్పగించారు. అయితే ఏడాది తిరగకముందే ఆయన కూడా మృతి చెందారు. అనంతరం మూడో విద్యాశాఖ మంత్రిగా సుదివ్య సోనూను నియమించారు. జేఎంఎంలో కీలక నేతగా, హేమంత్ సోరెన్‌కు నమ్మకమైన వ్యక్తిగా ఉన్న ఆయన కూడా ఇటీవల సెప్టెంబర్ 6, 2026న కన్నుమూశారు.

వరుసగా ముగ్గురు విద్యాశాఖ మంత్రులు అకాల మరణం చెందడంతో ఇప్పుడు ఆ పదవి విషయంలోనే కొత్త చర్చ మొదలైంది. తదుపరి విద్యాశాఖ మంత్రి ఎవరనే దానిపై ఊహాగానాలు సాగుతున్నా.. ఆ పదవి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ కోటాలోని నేతకు ఈసారి విద్యాశాఖ ఇవ్వొచ్చనే చర్చ కూడా ఉంది.

మరోవైపు హేమంత్ సోరెన్ తన భార్య, ఎమ్మెల్యే కల్పనా సోరెన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని ఆమెకే విద్యాశాఖ అప్పగించే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ రాజకీయాల్లో వినిపించే నమ్మకాలు, ప్రచారాలు మాత్రమే. ఒక పదవి చేపట్టిన ముగ్గురు నేతలు వరుసగా మరణించడం విషాదకరమైన యాదృచ్ఛికమే తప్ప.. దానికి అంధ విశ్వాసంతో సంబంధం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

Also Read : శవాలు ప్రశ్నలు అడుగుతున్నాయి!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.