Uber : ఓలా, ఉబర్ వంటి యాప్‌లలో క్యాబ్ బుక్ చేసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రయాణం మొదలుకాక ముందే ప్రయాణికులను టిప్ అడగకూడదని ప్రభుత్వం క్యాబ్ కంపెనీలను గట్టిగా ఆదేశించింది. ఎక్కువ డబ్బులు ఇస్తేనే కారు త్వరగా వస్తుందంటూ ప్రయాణికుల నుంచి ముందే అదనంగా డబ్బులు వసూలు చేయడాన్ని అస్సలు ఒప్పుకోమని తేల్చి చెప్పింది. ఈ నియమాన్ని వెంటనే అమలు చేయాలని సూచించింది.

ఫోన్‌లో క్యాబ్ బుక్ చేసేటప్పుడు.. ముందే టిప్ ఇవ్వండి ఎక్కువ డబ్బులు ఇస్తే కారు త్వరగా వస్తుందని యాప్‌లలో కనిపిస్తుంటుంది. ఎక్కువ డబ్బులు ఇస్తేనే డ్రైవర్ వస్తాడేమో, లేకపోతే రాడేమో అని భయపడి జనాలు ముందే డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇది తప్పు అని గ్రహించిన ప్రభుత్వం దీనికి వెంటనే చెక్ పెట్టింది.

క్యాబ్ కంపెనీలన్నీ తమ యాప్‌లను వెంటనే మార్చాలని ప్రభుత్వం చెప్పింది. ప్రయాణం పూర్తి కాకుండా ప్రయాణికులకు టిప్ అడిగే మెసేజ్‌లు చూపించకూడదని తెలిపింది. అదనంగా డబ్బులు ఇస్తేనే డ్రైవర్ వస్తాడనో, లేదా త్వరగా కారు దొరుకుతుందనో జనాలను గందరగోళం చేయకూడదని స్పష్టం చేసింది.

ఇవ్వచ్చు, కానీ ప్రయాణం పూర్తయిన తర్వాత మాత్రమే ఇవ్వాలి. ప్రయాణం అంతా అయిపోయాక, డ్రైవర్ సరిగ్గా తీసుకెళ్తే మీ ఇష్టపూర్వకంగా టిప్ ఇవ్వవచ్చు. ప్రయాణికుడు ఇచ్చే ఆ టిప్ డబ్బులు పూర్తిగా డ్రైవర్‌కే వెళ్లాలి, కంపెనీలు అందులో రూపాయి కూడా కట్ చేసుకోకూడదు. ప్రయాణం దొరకడం కోసం ముందే టిప్ అడగడం వేరు, ప్రయాణం నచ్చాక ఆనందంగా టిప్ ఇవ్వడం వేరు అని ప్రభుత్వం చెప్పింది.

క్యాబ్ బుక్ చేసేటప్పుడే కంపెనీలు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని చాలా మంది ఫిర్యాదులు చేశారు. దాంతో ప్రభుత్వం ఈ మంచి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల బుకింగ్ చేసేటప్పుడే అదనంగా డబ్బులు కట్టాల్సిన బాధ ప్రయాణికులకు తప్పుతుంది. ప్రయాణం అయ్యాకే మనకు నచ్చితేనే టిప్ ఇచ్చే వెసులుబాటు ఉంటుంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.