చాలామందికి ఉదయం నిద్రలేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ తాగే అలవాటు ఉంటుంది. టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, అలసట మాయమవుతుందని భావిస్తారు. ఈ క్రమంలో కనీసం బ్రష్ కూడా చేయకుండా టీ తాగుతుంటారు. అయితే ఉదయం లేచిన వెంటనే పరగడుపున టీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు(Health Issues) వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాత్రంతా ఏం తినకుండా ఉన్న తర్వాత ఉదయం కడుపులో యాసిడ్ స్థాయిలు సహజంగానే చురుకుగా ఉంటాయి. అలాంటి సమయంలో ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు మరింత పెరుగుతాయి. దీనివల్ల తీవ్రమైన అసిడిటీ, గ్యాస్, కడుపులో ఉబ్బరం, గుండెల్లో మంట, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు వస్తాయి.

Also Read : బిహార్‌లో మొదలైన జెన్ జీ మూమెంట్.. హై టెన్షన్!

టీలో కెఫిన్, టానిన్లు అధికంగా ఉంటాయి. పరగడుపున టీ తాగినప్పుడు, ఈ టానిన్లు మనం తీసుకునే ఆహారం నుంచి శరీరం ఐరన్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలను పీల్చుకోకుండా అడ్డుకుంటాయి. కాలక్రమేణా ఇది రక్తహీనత, ఎముకల బలహీనతకు దారితీస్తుంది. టీలోని కెఫిన్ డ్యూరెటిక్ గుణాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల పదే పదే మూత్రవిసర్జన జరిగి శరీరంలో నీటిశాతం తగ్గి డిహైడ్రేషన్ సమస్య వస్తుంది. అంతేకాకుండా పరగడుపున టీ తాగడం వల్ల ఆకలి చచ్చిపోతుంది. ఇది కాలేయం, జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది. దీర్ఘకాలంలో ఈ అలవాటు గ్యాస్ట్రిటిస్, అల్సర్లకు కారణమవుతుంది.

ఉదయాన్నే లేవగానే టీకి బదులుగా గోరువెచ్చని నీరు లేదా నిమ్మకాయ నీరు తాగడం మంచిది. టీ తాగాలనుకుంటే ముందుగా నానబెట్టిన బాదం, బిస్కెట్ లేదా తేలికపాటి అల్పాహారం తీసుకున్న తర్వాత మాత్రమే టీ తాగాలి. అలాగే కాఫీ, పాల టీలకు బదులుగా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీలను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : అమెజాన్, బిగ్‌బాస్కెట్, ఇన్‌స్టామార్ట్‌లకు బిగ్ షాక్.. ఫుడ్ లైసెన్సులు రద్దు.. ఎందుకో తెలుసా?