Jagga Reddy : మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించే స్థాయి, పర్సనాలిటీ సుస్మితది కాదని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కొండా సురేఖ కూతురు నోరుజారి మాట్లాడడం సరికాదన్నారు. ఒకవేళ తన కూతురు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడితే అది తప్పేనని అంటనన్నారు. కేవలం కొండా సురేఖ కూతురు కాబట్టే తామంతా సంయమనం పాటిస్తున్నామని, లేదంటే పరిస్థితి వేరేలా ఉండేదని జగ్గారెడ్డి హెచ్చరించారు. ఇలాంటి పనులను ఎవరూ ప్రోత్సహించకూడదని జగ్గారెడ్డి సూచించారు.

కొండా సురేఖ, మురళి దంపతులు మంచి రాజకీయ నాయకులని, వారి లీడర్షిప్ చాలా స్ట్రాంగ్ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. కానీ, తల్లిదండ్రులు బలమైన రాజకీయ నాయకులు కదా అని వారి కూతురు సీఎంను తిట్టడం పెద్ద మూర్ఖత్వమని తెలిపారు. సీఎంపై ఆమె చేసిన కామెంట్లను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు జగ్గారెడ్డి.

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై పార్టీ లైన్ దాటి సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా మాట్లాడొద్దని చెప్పారని, ఈ క్రమశిక్షణారాహిత్య అంశాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని సీఎం స్పష్టం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో ఎప్పుడైనా యాక్షన్‌లు, రియాక్షన్‌లు ఉంటాయని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కొండా సురేఖ దంపతులను తాము ఎప్పుడూ గౌరవిస్తామని, అయితే ఆ గౌరవాన్ని ఆసరాగా చేసుకుని సీఎంను విమర్శించడం సరికాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. పరకాల నియోజకవర్గం నుంచి తానూ పోటీ చేయాలనుకుంటున్నట్లు చెబుతూ, సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని ఆమె తప్పుబట్టారు. పార్టీ టికెట్లు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడానికి సీఎం ఎవరు అని ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తమ కుటుంబం ఎంతో సహకరించిందని, కానీ సీఎం అయిన తర్వాత ఆయన పాత మిత్రులను విస్మరించి, వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. తన టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదని, కేవలం రేవంత్ రెడ్డి మాత్రమేనని, ఆయన కుటుంబ అవినీతి బండారాలను బయటపెడతానని సుస్మిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.